తెలుగు రాష్ట్రాల్లో ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. దీంతో బయటకు వెళ్లాలంటనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో పలు జిల్లాల్లో ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే రాక ముందే రోకళ్లు పగిలిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు 40 డిగ్రీలకే పరిమితమైన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 43 డిగ్రీలు దాటిపోయాయి. రేపు, ఎల్లుండి పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణ పేట తదితర జిల్లాల్లో ఆదివారం వడగాల్పలు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో శనివారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది.