telugu navyamedia
తెలంగాణ వార్తలు సామాజిక

తెలంగాణ పర్యటనలో కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేజ్ అక్తర్

తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమం ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకొన్నది
ప్రభుత్వ సంకల్పం, అధికారులు, సిబ్బంది కృషికి ఫలితాలు కనిపిస్తున్నాయి

కర్ణాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేద్ అక్తర్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు హరితహారం, అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై అధ్యయనం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో పర్యటించిన ఆయన దూలపల్లి ఫారెస్ట్ రీసెర్చ్ నర్సరీ, కండ్లకోయ ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు వెంట పచ్చదనం, అలాగే హైదరాబాద్ లో అంతర్గత రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), మీడియన్ పాంటేషన్లను పరిశీలించారు.

తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమమని, తాను పర్యటించిన అన్ని ప్రాంతాలు పచ్చదనం పరుచుకొన్నదని జావేద్ అక్తర్ ప్రశంసించారు. ప్రభుత్వ సంకల్పానికి, అధికారులు, సిబ్బంది, ప్రజల కృషి తోడైన ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. సీఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ స్వయంగా కర్ణాటక అధికారికి వివిధ ప్రాంతాల్లో హరితహరం కార్యక్రమాలను వివరించారు. కండ్లకోయ ఆక్సీజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను చాలా చక్కగా అభివృద్ది చేశారని, రాష్ట్ర మంతటా ఇదే తీరులో 109 ఫారెస్ట్ పార్కులను పర్యావరణ పరంగా ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆయన అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, నగరంలోనూ పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు.

కర్ణాటక ప్రభుత్వం కూడా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుకు ప్రణాళికలు రూపొందిస్తోందని, ఆ అధ్యయనంలో భాగంగా తెలంగాణలో పర్యటించినట్లు జావేద్ అక్తర్ తెలిపారు.

క్షేత్రస్థాయి పర్యటన తర్వాత అరణ్య భవన్ లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, కంపా పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూసింగ్ మేరుతో జావేద్ సామావేశం అయ్యారు. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ, ఫలితాలను పీసీసీఎఫ్ ఈ సందర్భంగా వివరించారు.

పర్యటనలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి డీఎఫ్ఓలు ఎం. జోజి, సుధాకర్ రెడ్డి, జానకి రామ్ తో పాటు, అటవీశాఖ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts