telugu navyamedia
తెలంగాణ వార్తలు

కిషన్‌రెడ్డిపై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు

ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవమాన పూరిత, నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మంత్రులు త‌ప్ప‌బ‌ట్టారు.ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…ధాన్యం సేకరణ అంశాలపై కేంద్ర మంత్రిని ఐదుసార్లు రాష్ట్ర మంత్రుల బృందమే కలిసిందని, ప్రతిసారీ అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. అయినా తెలంగాణ రైతాంగం కోసం వాటన్నింటిని భరించి మొన్నటి రోజున కలిశామని ఈసారి వారి తీరు పరాకాష్టకు చేరుకుంది అన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మార్చి నెల సమావేశానికి రాలేదు .. ఫిబ్రవరి సమావేశాలకు రాలేదు అని అబద్దాలు చెప్పడం బాధాకరం అన్నారు. మినిట్స్ తెప్పించుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. ఫిబ్రవరి, మార్చిలో రెండు సార్లు తెలంగాణ అధికారులు కేంద్రం పెట్టిన సమావేశంకు హాజరు అయ్యారని, కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయి ఉండి ఎవరి తరపున మాట్లాడ్తున్నారని ఆయన ప్రశ్నించారు.

దీనిపై 16కు పైగా లేఖలు కేంద్రానికి రాసిన విషయాన్ని గుర్తు చేశారు, ఈ విషయం కేంద్ర మంత్రికి తెలియదా అని ప్రశ్నించారు.తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతాయి. పాత కోటా 5 లక్షల టన్నుల బియ్యం ఇంకా తీసుకపోలేదు. నెలకు 10 లక్షల టన్నుల బియ్యం ఇచ్చే సామర్థ్యం తెలంగాణకు ఉంది. కానీ ఎన్నడూ 3 లక్షల టన్నులకు మించి తీసుకోలేదు.చివరగా మా బృందం వెళ్లి తీవ్ర వత్తిడి పెడితే రెండు నెలలు మాత్రం 10 లక్షల టన్నులు తీసుకున్నారన్నారు.

ఏప్రిల్ రెండు లోగా కేంద్రం, ప్రధాని పునరాలోచించి ధాన్యం సేకరణకు తెలంగాణకు అనుమతివ్వాలని కోరారు లేనిపక్షంలో గౌరవ సీఎం గారు, తెలంగాణ ప్రజలు రైతులు చేసే ఉద్యమం సెగ కేంద్రానికి తగులుతుందన్నారు.

Related posts