telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తాం – భద్రాచలానికి కేసీఆర్ వ‌రాలు జ‌ల్లు..

*భద్రాచలం ముంపు బాధితుల‌కు కేసీఆర్ వ‌రాలు జ‌ల్లు..
*వరద ఇబ్బందులు లేకుండా రూ.1,000 కోట్లు..
*వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం జరగాలి..
*వరద బాధితులకు తక్షణమే రూ.10 వేలు ఆర్థికసాయం,
20 కిలోల చొప్పున బియ్యం

*వాతావరణశాఖ ప్రకారం ఈ నెల 29 వరకు వర్షాలు ఉంటాయి

భద్రాచలం ప్రాంతంలో ప‌ర్యటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ..ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు.గోదావరి ప్రవాహం 90, 100 అడుగులుకు చేరినా.. ఇబ్బందలు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

వరద ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ నిర్మిస్తామ‌ని చెప్పారు. ఆ కాలనీ భూమి పూజకు తానే స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

వరద చేరని ఎత్తైన ప్రదేశాల్లో అనువైన స్థలాలను గుర్తించి, బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ ను సీఎం ఆదేశించారు.

వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని చెప్పారు. శాశ్వత కాలనీల కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

వరదలతో ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. గోదావరికి యాభై అడుగుల నీరు వచ్చినా కాలనీలు మునిగిపోతున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీవినీ ఎరుగని వరదలు చూస్తున్నామన్నారు.

తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు వెంటనే ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మరో రెండు నెలలు ఇబ్బంది పడకుండా 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు. వెయ్యి కోట్లతో పినపాక, భద్రాచలం ప్రాంత వాసులకు రెండు మూడు వేల ఇళ్లతో శాశ్వత కాలనీలను నిర్మిస్తామని కేసీఆర్ తెలిపారు.

29 వ తేదీ వరకూ ముప్పు పొంచి ఉందని చెప్పారు. బూర్గంపాడు వద్ద కూడా కరకట్టను ఏ విధంగా నిర్మించాలో ప్రణాళిక రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఎంత వరద వచ్చినా ఆలయం వద్దకు నీరు రాకుండా చూడాలన్నారు.

CM KCR announces Rs 1,000 crore to protect Bhadrachalam from flooding

అంత‌కుముందు భద్రాచలంలో గోదావరి నదిపై గంగమ్మ తల్లికి పూజలు చేసిన అనంతరం కరకట్టను పరిశీలించారు. భద్రాచలం జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ముంపు బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల, సౌకర్యాలు, వైద్యం, ఇతర సహాయం గురించి సీఎం ఆరా తీశారు. వారిని పేరుపేరునా పలకరించారు. తమకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందుతున్నాయని, స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని సీఎంకు బాధితులు వివరించారు. .

\

Related posts