telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఇక జమ్మలమడుగులో టీడీపీకి పెద్దదిక్కుగా రామసుబ్బారెడ్డే

Ramasubbareddy

జమ్మలమడుగు రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఎన్నికలకు ముందు మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాలకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజీ కుదిర్చారు. ఆదినారాయణరెడ్డిని కడప పార్లమెంట్‌కు రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీకి పోటీ చేశారు. అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నందుకు ఆదినారాయణరెడ్డి కుటుంబానికి అప్పటి వరకు రామసుబ్బారెడ్డి నిర్వహించిన ఎమ్మెల్సీ పదవిని అప్పగించారు. 2019 ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికల్లో తనకు చేస్తామన్న ఆర్థిక సాయం చేయలేదని, తన వర్గీయులపై వైసీపీ నేతల ఒత్తిడి పెరిగిపోయిందని చంద్రబాబు వద్ద ఆదినారాయణరెడ్డి పదేపదే ప్రస్తావించారు. పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెబుతూ వచ్చారు. ఈలోపు ఆది ఢిల్లీలోని బీజేపీ నేతల టచ్‌లోకి వెళ్లారు. చివరకు బీజేపీ గ్రీన్ సిగ్నలివ్వడంతో సోమవారం ఆపార్టీలో చేరారు.

ఇదే సమయంలో సీఎం జగన్, రామసుబ్బారెడ్డి ఇరువురు విమానాశ్రయంలో కలుసుకున్న ఫొటో వైరల్ అయింది. రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వీడుతున్నారని ఆ పొస్టింగ్ సారాంశం. రామసుబ్బారెడ్డి అమెరికాలో ఉన్న తన కుమారై వద్దకు కుటుంబసభ్యులతో కలిసి ఆగస్టు 16వ తేదీన వెళ్లారు. వాషింగ్టన్‌లో విమానం దిగారు. కచ్చితంగా అదే సమయంలో జగన్ కూడా అమెరికా పర్యటనకు వచ్చారు. ఎయిర్ పోర్టులో నుంచి బయటకు వస్తుండగా రామసుబ్బారెడ్డి, జగన్‌కు తారసపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య పలకరింపులు జరిగాయి. రామసుబ్బారెడ్డిని జగన్ పలకరించడంతో తన కుమారై వద్దకు వచ్చానని రామసుబ్బారెడ్డి చెప్పారు. రెండు నిమిషాలపాటు కుశల ప్రశ్నల అనంతరం ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. ఈ సమయంలో ఫొటో తీసిన వారు.. ఆ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. రామసుబ్బారెడ్డి అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే చంద్రబాబును కలిశారు. జమ్మలమడుగులోని రాజకీయ పరిణామాలతో పాటు వాషింగ్టన్‌లో జగన్ తనకు తారసపడిన విషయాన్ని కూడా వివరించారు. ఆదినారాయణరెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్న విషయం కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. రెండ్రోజుల కిందట కూడా చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. సోషల్ మీడియాలో రామసుబ్బారెడ్డి టీడీపీ వీడుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంద్రబాబుతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని చంద్రబాబుకు రామసుబ్బారెడ్డి చెప్పినట్లు సమాచారం. జమ్మలమడుగులో టీడీపీకి మళ్లీ రామసుబ్బారెడ్డే పెద్ద దిక్కయ్యారు. ఆదినారాయణరెడ్డి మాత్రమే బీజేపీలో చేరారు. ఆయన అనుచరులు మాత్రం బీజేపీలో చేరలేదు. త్వరలో ఓ సమావేశాన్ని ఆదినారాయణరెడ్డి ఏర్పాటు చేసి తన అనుచరులను కూడా బీజేపీలో చేర్చుతారనే ప్రచారం జరుగుతోంది.

Related posts