telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రపంచానికే భారతదేశం ఆదర్శం ..ప్రపంచంలో మేథావులు, సంఘ సంస్కర్తలు ఎక్కువ మంది భారతీయులే

ప్రపంచంలో‌ ఉన్న భారతీయులందరికి టీడీపీ అధినేత చంద్రబాబు 75 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం గుంటూరు జిల్లా, చేబ్రోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రతి ఒక్కరి గుండెలలో‌ జాతీయ స్ఫూర్తి నింపాలని అన్నారు. రాజకీయ నాయకులు, అమరవీరులు చేసిన త్యాగాలే ప్రజలలో దేశభక్తి నింపాయి. దేశ ప్రజలు ఏకమై పోరాడి సాధించిన విజయమే దేశ స్వతంత్ర్యం అని చంద్రబాబు పేర్కొన్నారు.

గత చరిత్రను నెమరవేసుకుంటూ భవిష్యత్తుతో సమన్వయ పరుచుకోవాలన్నారు. పరాయి పాలనలో ప్రజలు పేదరికాన్ని అనుభవించారని నాటి సంగతులను గుర్తు చేశారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నాయకులు సరికొత్త విధానాలు తెచ్చారని స్పష్టం చేశారు.

.ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా నిలిచిందన్న చంద్రబాబు.. ప్రపంచంలో మేథావులు, సంఘ సంస్కర్తలు ఎక్కవ మంది భారతీయులే ఉన్నారు.

ప్రధాని మోడీ ఎన్నో విషయాల్లో ఇతర దేశాల కంటే ముందున్నారని చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. ఇండియాలో మేధావులకు కొదవ లేదన్నారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకు వచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశ ఆర్ధిక స్వరూపాన్ని మార్చాయని చంద్రబాబు గుర్తు చేశారు.పేద ప్రజలకు సేవ చేయడం కోసం ఎన్టీఆర్ సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. టీడీపీ సర్కార్ తీసుకు వచ్చిన మహిళా రిజర్వేషన్లు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు దోహదపడిందని చెప్పారు.

ఒక‌ప్పుడు పేదరికంలో మగ్గిన భార‌తదేశం.. నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి వచ్చిందని, రక్షణ రంగంలో ఎంతో పురోభివృద్ధి సాధించామన్నారు. సొంతగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నామన్నారు.

 సంస్కరణలు వచ్చినప్పుడు టీడీపి సమర్థవంతంగా ఉపయోగించుకుందన్నారు. దేశ సమగ్రత కోసం టీడీపీ పని చేసిందని , ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఐటీ రంగానకి పెద్దపీట వేయడం వల్ల దాని ఫలితాలు ఇప్పుడు కన్పిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.

తాము తీసుకున్న చర్యల వల్ల పేద విద్యార్ధులు ఐటీ రంగంలోకి వచ్చారన్నారు.ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు ఇండియాకు చెందిన వారే సీఈవోలుగా ఉన్నారన్నారు.పోర్టులు, విమానాశ్రయాలు, నిర్మాణానికి చేసిన కృషిని చంద్రబాబు ప్రస్తావించారు.తాను సీఎంగా ఉన్న కాలంలో తీసుకు వచ్చిన సంస్కరణలు అభివృద్దికి కారణమయ్యాయన్నారు.

అవినీతి ఉన్నచోట అభివృద్ధి జరగదన్నారు. జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవాసులు కృషి చేయాలని పిలుపిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకు ఆదర్శమని, మహత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచానికి స్ఫూర్తి అని, మన గౌరవం, ప్రతిష్ట పెరగాలంటే దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు.

Related posts