ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటల తూటాలు పేలాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపైనే కాకుండా ఆయన కుమారుడు నారా లోకేశ్ పైనా వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఘాటుగా బదులిచ్చారు. “మా అబ్బాయి గురించి మాట్లాడారు.. ఈ అంబటి రాంబాబుకు తెలియదు, ఇదే అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి చర్చకు వస్తే చెప్పా.. మీ అబ్బాయిని అమెరికా పంపిస్తే తిరిగి వచ్చాడు.. మావాడు చదువుకుంటున్నాడు, గర్వపడుతున్నా” అంటూ నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు.
మా ఇల్లు మీ ఇంటికి దూరమో, మీ ఇంటికి మా ఇల్లూ అంతే దూరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనుషులను రెచ్చగొట్టడం, మనోభావాలను దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వీళ్లు నన్ను అవమానం చేయాలనుకుంటే, అదేవిధంగా వాళ్లకు కూడా అవమానం జరుగుతుంది. ఆ విషయం వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.