telugu navyamedia
క్రీడలు వార్తలు

పంత్ గురించి సంచలన విషయాలు చెప్పిన భారత మాజీ చీఫ్ సెలెక్టర్…

టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ఒకప్పుడు అవకాశం కోసం దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌ను వేడుకున్నాడని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ప్రస్తుతం చెన్నై వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌కు తెలుగు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అతను.. కామెంట్రీ సందర్భంగా రిషభ్ పంత్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. క్రీజులో తనదైన బ్యాటింగ్‌తో చెలరేగుతున్న రిషభ్ పంత్‌ను ప్రశంసిస్తూ చెప్పుకొచ్చాడు. ‘2016 అండర్-19 ప్రపంచకప్‌లో రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కానీ తొలుత అతను ఆ టోర్నీకి ఎంపికవ్వలేదు. టీమ్ ప్రాబబుల్స్‌లో ఉన్న అతను అండర్-19 కోచ్, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ దగ్గరకు వెళ్లి ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నాడు. దాంతో అతని సత్తాకు పరీక్ష పెట్టిన రాహుల్ ద్రవిడ్.. పంత్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు. వెంటనే అతన్ని జట్టులోకి తీసుకున్నాడు. అయితే ఆ టోర్నీలో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న ఇషాన్ కిషాన్ కూడా వికెట్ కీపర్ కావడంతో పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవడం కష్టమైంది.

దాంతో ఇషాన్ కిషాన్‌ను ఫీల్డర్‌గా ఉంచిన ద్రవిడ్.. పంత్‌తో వికెట్ కీపింగ్ చేయించాడు. ఆ టోర్నీలో అదరగొట్టిన పంత్ మళ్లీ వెనక్కి చూసుకోలేదు. ప్రతీ ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఓపికగా ఎదురు చూడటమే కావాలి. వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకోవాలి. ఇక ఏ పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం పంత్‌కు ఉంది. అందుకే అతను పదే పదే విఫలమైనా.. సెలెక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలిచింది. పంత్ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నా.. వికెట్ కీపింగ్‌లో ఇంకా చాలా మెరుగవ్వాల్సి ఉంది. ముందు ముందు ఆ స్కిల్‌ను కూడా పంత్ సాధిస్తాడు. ‘అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు. ఇక ఆ టోర్నీలో ఫైనల్‌కు చేరిన భారత్.. వెస్టిండీస్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. కెప్టెన్ ఇషాన్ కిషాన్ ఐపీఎల్‌కే పరిమితమవ్వగా.. పంత్ ధోనీ వారసుడిగా భారత జట్టులోకి వచ్చి అంతర్జాతీ క్రికెట్‌ను మొదలుపెట్టాడు. మధ్యలో కొంత పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచినా.. ఆసీస్ పర్యటన నుంచి సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా ధాటైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు.

Related posts