ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని 11 జిల్లాలు రెడ్జోన్లో ఉన్నాయన్నారు. కరోనా వివరాలు దాచిపెట్టడం తప్పని చెబుతున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కరోనా గురించి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. ప్రపంచమంతా కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటే.. వైసీపీ ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు పణంగా పెడుతోందని, కరోనాతో ప్రజలు భయపడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా అనేది భయంకరమైన వైరస్ అని, 14 నుంచి 25 రోజుల్లోగా ఎప్పుడైనా వైరస్ బయటపడుతుందని చంద్రబాబు అన్నారు.


