telugu navyamedia
క్రీడలు వార్తలు

డే&నైట్ టెస్టు ఆడబోతోన్న భారత మాహిళల జట్టు…

ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో భారత మహిళల జట్టు పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. మహిళల క్రికెట్​ను మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు షా పేర్కొన్నారు. ‘మహిళల క్రికెట్ పట్ల మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్​లో భారత మహిళలు తొలి పింక్ బాల్ టెస్టు ఆడబోతున్నారు. ఈ విషయం తెలిపేందుకు చాలా సంతోషిస్తున్నా. మహిళల క్రికెట్​ను మరింత ముందుకు తీసుకెళతాం’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. మహిళల క్రికెట్ చరిత్రలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే గులాబి టెస్టు రెండోది మాత్రమే. 2017లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తొలిసారిగా డేనైట్ టెస్టు ఆడాయి. జూన్ 2న భారత పురుషులతో పాటు మహిళలు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్​లో మిథాలీ సేన టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో పాల్గొననుంది. తర్వాత టీ20, వన్డే సిరీస్​లూ జరగనున్నాయి. ఇంకా షెడ్యూల్​ ప్రకటించనప్పటికీ సెప్టెంబర్ మధ్యలో ఈ పర్యటన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చివరసారిగా ఆసీస్​తో 2006లో టెస్టు మ్యాచ్ ఆడారు భారత మహిళలు.

Related posts