telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మధుర సంగీత సోదరులు రాజన్ నాగేంద్రకు స్వర నీరాజనం

Nagendra

తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ, సింహళ, తుళు, కొంకిణి భాషల్లో 450కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన అపూర్వ సంగీత సోదరులు రాజన్, నాగేంద్ర. మైసూర్ లోని శివరాం పేటలో రాజప్పకు 1933లో రాజన్, 1935లో నాగేంద్ర జన్మించారు .తెలుగు వారైన ఈ సోదరులు సంగీతంలో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కర్ణాటక, హిందుస్తానీ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. 1952లో “సంగీత లక్ష్మి” అన్న కన్నడ చిత్రానికి మొదటిసారి సంగీత దర్శకులుగా పనిచేశారు. ఆ చిత్రం ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. 1957లో బి.విఠలాచార్య దర్శకత్వం వహించిన “వద్దంటే పెళ్లి” అనే తెలుగు సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆ తరువాత తెలుగు సినిమా రంగంలో ఎన్నో సినిమాలకు స్వరాలను సమకూర్చారు.

నాలుగు దశాబ్దాల పాటు వీరి సంగీత ప్రయాణం కొనసాగింది. ఎన్నో మధురమైన పాటలనుప్రేక్షకులకు అందించారు. 2000వ సంవత్సరంలో సోదరుడు నాగేంద్ర చనిపోవడంతో రాజన్ మానసికంగా కృంగిపోయాడు. ఈనెల 11న రాజన్ తన 87వ ఏట మృతి చెందారు. వీరి స్మృతికి నివాళిగా వంశీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ అక్టోబర్ 24న అంతర్జాలంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మురళీమోహన్, చంద్రమోహన్, వంశీ రామ రాజు, ఆకునూరి శారద, భువనచంద్ర, రేలంగి నరసింహారావు, వై.వి.ఎస్.చౌదరి, వేటూరి రవిప్రకాశ్, ఆనంద్, ఎన్.బి.శాస్త్రి, భరద్వాజ తెన్నేటి సుధాదేవి, శైలజ సుంకరపల్లి, రాము, ప్రవీణ్‌కుమార్ కొప్పొలు, ప్రసాద్ సింహాద్రి, తాతా బాల కామేశ్వరరావు, లండన్ నుండి డా.నగేష్ చెన్నుపాటి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మురళి మోహన్ మాట్లాడుతూ “రాజన్-నాగేంద్ర సోదరులు తమ జీవితాలను సంగీతానికే అంకితం చేశారు. ఉన్నత విద్య అభ్యసించకపోయినా, శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా తండ్రి దగ్గర నుంచే సంగీతాన్ని నేర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆయన్ని నేను వ్యక్తిగతంగా కలుసుకోలేదు కానీ ఆయన సంగీతం అందించిన పలు పాటలంటే నాకు ఇష్టం” అని చెప్పారు.

చంద్ర మోహన్ మాట్లాడుతూ “రాజన్-నాగేంద్ర సోదరులు పేరుపొందిన గొప్ప సంగీత దర్శకులు. నేను నటించిన ‘నాగమల్లి’, ‘మూడు ముళ్ళు’, ‘ఇంటింటి రామాయణం’ లాంటి చిత్రాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు. తెలుగువారైన రాజన్-నాగేంద్ర కన్నడ చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరమైన విషయం. తెలుగు గాయనీ గాయకులు కొంతమందిని కన్నడ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ‘అగ్గిపిడుగు’ అనే తెలుగు చిత్రాన్ని కన్నడలో రాజ్ కుమార్ రీమేక్ చేయగా ఆ సినిమాకి రాజన్-నాగేంద్ర సంగీతం అందించారు. ‘పూజ’, ‘అద్దాల మేడ’, ‘నాలుగు స్తంభాలాట’ సినిమాల్లోని పాటలంటే నాకెంతో ఇష్టం. నా సినిమాల్లోని పాటలకు గుర్తింపు రావడానికి బాలు కూడా కారణం” అని చెప్పారు.

భువన చంద్ర మాట్లాడుతూ “తనువును కదిలించేది తాళం. మనసును కదిలించేది రాగం. సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు.. ఈ ముగ్గరు పాటకు త్రిమూర్తులు. ఏ తరం వారినైనా ఆకట్టుకునే గొప్ప పాటలను రాజన్-నాగేంద్ర అందించారు. వారు చనిపోయినప్పటికీ తాము సృష్టించిన కళల రూపంలో కళాకారులు ఎప్పటికీ బతికే ఉంటారు. ‘అప్పుల అప్పారావు’ సినిమా కోసం మొదటిసారి ఈవీవీ సత్యనారాయణతో కలిసి పని చేశాను. పాటకు సంబంధించిన సందర్భం చెప్పగానే ట్యూన్ పాడి వినిపించాను. ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడగగా.. ‘రాజన్-నాగేంద్ర’ అని ఈవీవీ అన్నారు. నాకెంతో సంతోషంగా అనిపించింది. నా జీవితంలో ఓ సంతోషకరమైన రోజది. రాజన్-నాగేంద్ర కంపోజ్ చేసిన పాటలు.. ‘సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్’. ఎప్పటికీ అవి అలాగే మిగిలిపోయి ఉంటాయి” అన్నారు.

శారద ఆకునూరి మాట్లాడుతూ “చిన్నప్పటి నుండి పాటలతో తన జీవితం పెనవేసుకుపోయిందని, 2018లో బెంగళూరు నుండి శ్రీ రాజన్ గారిని ఆహ్వానించి హైదరాబాదులో వారికి జీవిత సాఫల్య పురస్కారం, సద్గురు ఘంటసాల స్వర్ణపతకంతో ఘనంగా సత్కరించడం మరియు “ఆరు దశాబ్దాల రాజన్-నాగేంద్ర సినీ గీత వైభవం” పేరిట ఆయన స్వరపరచిన పాటలతో సంగీత విభావరి ఆయన సమక్షంలో నిర్వహించడం తన అదృష్టం” అని అన్నారు. 

బాల కామేశ్వరరావు, రాము, ప్రవీణ్. ప్రసాద్, శారద మొదలైన వారు రాజన్-నాగేంద్ర స్వరపరచిన గీతాలను ఆలపించారు.
బెంగుళూరు నుండి రాజన్ గారి కుమారులు అనంత్ ఈకార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమానికి అమెరికా గాన కోకిల శారద ఆకునూరి రూపకల్పన చేయగా డా.తెన్నేటి సుధా, శైలజ సుంకరపల్లి పర్యవేక్షించారు.

Related posts