ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని, మానవతా దృక్పథంతో సంక్షేమ పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రతి నెలా ఒక గ్రామానికి నేరుగా వచ్చి పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నానని, అందులో భాగంగానే దత్తి గ్రామానికి వచ్చానని చంద్రబాబు తెలిపారు.
దేశంలోని 29 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో కేవలం రూ.500 మాత్రమే పింఛను ఇస్తున్నారని, కానీ ఏపీలో మాత్రం తాము అత్యధికంగా అందిస్తున్నామని పోల్చి చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 13 మందికి పింఛను అందుతోందని, అందులో 59 శాతం మహిళలేనని వివరించారు.
కూటమి ప్రభుత్వం ప్రకటించిన “సూపర్ సిక్స్” పథకాలను సూపర్ హిట్ చేశామని, అన్ని హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.
మహిళల కష్టాలు తీర్చేందుకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
“స్త్రీ శక్తి” పథకం కింద ఆగస్టు 15న ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కేవలం 45 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని తెలిపారు.
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చంద్రబాబు అన్నారు.
ఇప్పటికే రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.6,000 జమ చేశామని, త్వరలోనే మరో రూ.14,000 అందిస్తామని హామీ ఇచ్చారు.
యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని చెబుతూ, ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించామన్నారు.
ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలిచ్చామని తెలిపారు. రాష్ట్రానికి ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు.