telugu navyamedia
క్రీడలు

ఐపీఎల్ : చెన్నై విజయోత్సవం..

మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పేసర్‌ దీపక్‌ చాహర్‌ (3/20), స్పిన్నర్లు విజృంభించడంతో చెన్నై సూపర్‌కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో కలకత్తా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. చాహర్‌తో పాటు హర్భజన్‌ (2/15), జడేజా (1/17), తాహిర్‌ (2/21) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మొదట కలకత్తా పరుగుల కోసం తీవ్రంగా కష్టపడింది. 9 వికెట్లకు 108 పరుగులే చేయగలిగింది. రసెల్‌ (50 నాటౌట్‌; 44 బంతుల్లో 5×4, 3×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లక్ష్యం చిన్నదే అయినా చెన్నై ఛేదన అంత తేలిగ్గా ఏమీ సాగలేదు. డుప్లెసిస్‌ (43 నాటౌట్‌; 45 బంతుల్లో 3×4) పట్టుదల ప్రదర్శించడంతో లక్ష్యాన్ని చెన్నై 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చాహర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.
ఏ దశలోనూ విజయంపై అనుమానం కలగకపోయినా ఛేదనలో చెన్నై కూడా కష్టపడింది. పరుగులు అంత తేలిగ్గా రాలేదు. ఆరంభంలో ఓపెనర్‌ వాట్సన్‌ (17; 9 బంతుల్లో 2×4, 1×6).. ఆ తర్వాత రైనా (14; 13 బంతుల్లో 1×4, 1×6) ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెన్నై పని తేలిక చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరూ ధాటిగా ఆడే క్రమంలో త్వరగానే నిష్క్రమించారు. 5 ఓవర్లలో స్కోరు 35/2. పిచ్‌ స్వభావాన్ని అర్థం చేసుకున్న మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ జాగ్రత్తగా ఆడాడు. అతడికి రాయుడు (21; 31 బంతుల్లో 2×4) తోడయ్యాడు. కానీ షాట్లు ఆడడం కష్టంగా ఉండడంతో పరుగులు వేగంగా రాలేదు. 10 ఓవర్లలో స్కోరు 57 మాత్రమే. 14 ఓవర్లకు 77. రాయుడు స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. కానీ విఫలమయ్యాడు. 15వ ఓవర్లో ఓ క్యాచ్‌ను ఫీల్డర్‌ వదిలేయడంతో బతికిపోయిన అతడు.. అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. అయితే వస్తూనే బౌండరీ బాదిన కేదార్‌ జాదవ్‌ (8 నాటౌట్‌; 8 బంతుల్లో 1×4) ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. వెంటనే గర్నీ వేసిన 18వ ఓవర్లో డుప్లెసిస్‌ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో చెన్నై 100 దాటింది. ఆ తర్వాత విజయం లాంఛనమే.
బ్యాటింగ్‌ కష్టంగా ఉండే మందకొడి పిచ్‌పై మొదట కలకత్తా పరుగుల కోసం కష్టపడిందనే చెప్పాలి. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన చెన్నై బౌలర్లు కలకత్తాను ఏ దశలోనూ పుంజుకోనివ్వలేదు. రసెల్‌ మరో చక్కని ఇన్నింగ్స్‌తో ఆదుకోకుంటే ఆ జట్టు వంద పరుగులైనా చేసేది కాదు. ఎప్పటిలా అతడు వీరబాదుడు బాదలేకపోయినా ఎంతో విలువైన పరుగులు చేశాడు. మ్యాచ్‌లో కలకత్తా ఆరంభమే పేలవం. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఆ జట్టు ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. చెన్నై బౌలింగ్‌ దాడిని ఆరంభించిన అతడు ఓవర్‌ కి ఒక వికెట్‌ చొప్పున తీసుకుంటూ పోయాడు. ఇన్నింగ్స్‌ ఆరంభ ఓవర్లో లిన్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతడు.. మూడో ఓవర్లో రాణా (0)ను, ఐదో ఓవర్లో ఉతప్ప (11)నూ పెవిలియన్‌ చేర్చాడు. చాహర్‌ తన తొలి మూడు ఓవర్లలో 14 పరుగులే ఇచ్చాడు. హర్భజన్‌ సింగ్‌ కూడా చక్కగా బౌలింగ్‌ చేశాడు. రెండో ఓవర్లో బంతిని అందుకున్న అతడు.. ఓపెనర్‌ నరైన్‌ (6) ఇంటిదారి పట్టించాడు. 5 ఓవర్లలో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా చిక్కుల్లో పడింది. ఆ తర్వాత కూడా చెన్నై బౌలర్లు ఆ జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వికెట్ల వేట కొనసాగిస్తూనే పోయారు. శుభ్‌మన్‌ (9)తో కలిసి దినేశ్‌ కార్తీక్‌ (19; 21 బంతుల్లో 3×4) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతడి పోరాటం కాసేపే. ఈసారి తాహిర్‌ కోల్‌కతాను దెబ్బతీశాడు. నిలదొక్కుకున్న కార్తీక్‌తో పాటు శుభ్‌మన్‌ను తన వరుస ఓవర్లలో ఔట్‌ చేశాడు. 11వ ఓవర్లో శుభ్‌మన్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 47 పరుగులు మాత్రమే. ఆ తర్వాత కూడా పతనం ఆగలేదు. కానీ ఓ వైపు నిలబడ్డ రసెల్‌ పోరాడాడు. తాహిర్‌, హర్భజన్‌, జడేజాల కట్టుదిట్టమైన బౌలింగ్‌ వల్ల అతడు కూడా సులువుగా భారీ షాట్లు ఆడలేకపోయాడు. కానీ క్లిష్ట   పరిస్థితుల్లోనూ మూడు సిక్స్‌లు, ఐదు ఫోర్లు కొట్టాడు. పియూష్‌ చావ్లా (8), కుల్‌దీప్‌ (0), ప్రసిద్ధ్‌ కృష్ణ (0) త్వరగా నిష్క్రమించడంతో    కోల్‌కతా 79/9తో మూడంకెల స్కోరు అందుకునేలా కనపడలేదు.  కానీ గర్నీ (1 నాటౌట్‌)తో కలిసి అభేద్యమైన ఆఖరి వికెట్‌కు రసెల్‌ 29  పరుగులు జోడించి జట్టుకు పోరాడగలిగే స్కోరందించాడు.
ipl 2019 Updates Point Table
నేడు మ్యాచ్ : ముంబై vs పంజాబ్ రాత్రి 8 గంటలకు జరుగనుంది. 

Related posts