telugu navyamedia
క్రీడలు వార్తలు

పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్…

పంజాబ్ కింగ్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్దాంతరంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌ నుంచి దూరమయ్యాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘గత రాత్రి కేఎల్ రాహుల్ తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డాడు. వెంటనే టీమ్ ఫిజియో ప్రాథమిక చికిత్స అందించగా అతను కోలుకోలేదు. దాంతో అతన్ని అత్యవసర రూమ్‌కు తరలించి పలు పరీక్షలు చేశారు. రాహుల్ అపెండిసైటిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. సర్జరీ అనివార్యమైన నేపథ్యంలో వెంటనే అత్యంత భద్రతా మధ్య అతన్ని ఆసుపత్రికి తరలించారు.’అని పేర్కొంది. అయితే లీగ్‌కు దూరమవుతాడా? లేక కొన్ని మ్యాచ్‌లకేనా? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ప్రస్తుతం ఫ్రాంచైజీ చెబుతున్న ప్రకారం రాహుల్ ఆసుపత్రిలో చేరాడు. ఈ లెక్కన అతను టీమ్ బయో బబుల్ దాటినట్లే. అతను తిరిగొచ్చినా నిబంధనల ప్రకారం మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అంతేకాకుండా అతనికి సర్జరీ అనివార్యమంటున్నారు. ఒకవేళ సర్జరీ అయితే కనీసం 2-3 వారాల విశ్రాంతి అవసరం. ఈ క్రమంలో రాహుల్ దాదాపు ఈ సీజన్‌కు దూరమైనట్లేనని విశ్లేషకుల అభిప్రాయం. పైగా టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా బీసీసీఐతో పాటు అతను కూడా రిస్క్ చేయకపోవచ్చు. 331 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు రాహుల్.

Related posts