telugu navyamedia
క్రీడలు

ఐపీఎల్ : ముంబై టీం కి ఎదురుదెబ్బ.. సారథికి విశ్రాంతి..

ఐపీఎల్ అంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం. ఆటలో ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. దీనితో సహజంగానే ఆటగాళ్లు గెలుపు పరుగులో ఒత్తిడికి లోనై ఫిట్నెస్ కు దూరం అవుతున్నారు. తాజాగా, ముంబయి ఇండియన్స్‌ జట్టుకు ఇదే ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి, టీమిండియా వైస్‌ కెప్టెన్ రోహిత్‌శర్మకు గాయం అయింది. బుధవారం రాత్రి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ముంబయి ఇండియన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కోసం రోహిత్‌ సాధనలో భాగంగా మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తూ డైవ్‌ చేశాడు. ఆ సమయంలో కుడికాలు కండరాలు పట్టేయడంతో నొప్పితో గ్రౌండ్‌లోనే విలవిల్లాడాడు. జట్టు వైద్యుడు నితిన్‌ పటేల్‌ వచ్చి రోహిత్‌ను మైదానం నుంచి తీసుకెళ్లాడు. 
రోహిత్‌ గాయం గురించి ఆ జట్టు యాజమాన్యం ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. రోహిత్‌కు మాత్రం పెద్ద గాయమే అయినట్లు సమాచారం. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు నుంచి ఆరు వారాల విశ్రాంతి అవసరమవుతుందని తెలిసింది. అయితే ప్రపంచకప్‌లోపు రోహిత్‌ కోలుకుంటాడని ముంబయి ఇండియన్స్‌ జట్టు ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కొద్ది రోజుల్లో ప్రపంచకప్‌ ప్రారంభమవుతుందనగా రోహిత్‌ గాయపడటం ఇది రెండో సారి. ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఏప్రిల్‌ 15న బీసీసీఐ ప్రకటించనుంది. మే 30న ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో జూన్‌ 5న భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 2015 ప్రపంచకప్‌ సమయంలోనూ రోహిత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. దీనితో ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. భారత జట్టు సెమీ ఫైనల్స్‌ చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. ముంబయి ఇండియన్స్‌తో పాటు భారత జట్టులో రోహిత్‌ కీలక ఆటగాడు కావడంతో రోహిత్‌శర్మ గాయం ఇరు జట్లకు ఆందోళన కలిగిస్తోంది.

Related posts