telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఆఫ్గనిస్తాన్ లక్ష్యం .. 225 పరుగులే.. ఇండియా కట్టడి చేసిందా.. !

afghanistan target is 225 runs

నేటి ప్రపంచ కప్ మ్యాచ్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 225 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విరాట్‌ కోహ్లి(67), కేదార్‌ జాదవ్‌(52)లు హాఫ్‌ సెంచరీలు సాధించగా, కేఎల్‌ రాహుల్‌(30), విజయ్‌ శంకర్‌(29), ఎంఎస్‌ ధోని(28)లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో భారత్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించలేదు. రోహిత్‌ శర్మ(1) నిరాశపరచడంతో భారత్‌ 7 పరుగుల వద్ద తొలి వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో రాహుల్‌కు కోహ్లి జత కలిశాడు. వీరిద్దరూ 57 పరుగులు సాధించిన తర్వాత రాహుల్‌ అనవసరపు షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. అప్పుడు కోహ్లి-విజయ్‌ శంకర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది యత్నం చేసింది.

అనంతరం విజయ్‌ శంకర్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా 122 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో కోహ్లి సైతం ఔట్‌ అయ్యాడు. కాగా, ఎంఎస్‌ ధోని, కేదార్‌ జాదవ్‌లు కాస్త ప్రతిఘటించడంతో భారత్‌ తేరుకుంది. ఈ జోడి 57 పరుగులు జత చేసిన తర్వాత ధోని ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి హార్దిక్‌ పాండ్యా(7) కూడా పెవిలియన్‌ చేరగా, షమీ(1) కూడా వెంటనే ఔటయ్యాడు. ఇక కేదార్‌ జాదవ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని చివరి ఓవర్‌ ఐదో బంతికి ఔటయ్యాడు. దాంతో భారత్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత ఆటగాళ్లు పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో మహ్మద్‌ నబీ, గుల్బాదిన్‌ నైబ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్‌ ఖాన్‌, రహ్మత్‌ షా, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, అఫ్తాబ్‌ అలామ్‌లకు వికెట్‌ చొప్పున లభించింది.

Related posts