telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆశలన్నీ .. శిఖర్‌ ధావన్‌ పైనే.. జన్మదిన శుభాకాంక్షలు..

sikhar dhawan birthday

ఐసీసీ ఈవెంట్లలో దుమ్ముదులిపే భారత బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌. 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా టైటిల్‌ సాధించినా, 2017లో రన్నరప్‌గా నిలిచినా అందుకు కారణం అతడి మెరుపులే. ఆస్ట్రేలియాలో జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్‌ సెమీస్‌ చేరడంలో తనదైన ముద్రవేశాడు. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసి సత్తా చాటాడు. భారీ టోర్నీల్లోనే కాకుండా జట్టుకు అవసరమైన వేళ భారీ ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నాడు. ప్రపంచకప్‌లో ఆసీస్‌ పోరులో చేతివేలికి గాయమైనా.. నొప్పి వేధిస్తున్నా.. అద్భుత శతకం బాది విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేడు గబ్బర్ పుట్టినరోజు.

వేలి గాయం నుంచి కోలుకున్న శిఖర్‌ ధావన్‌ విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టులోకి వచ్చాడు. పూర్తిగా విఫలమయ్యాడు. బంగ్లాదేశ్‌ టీ20 సిరీస్‌లోనూ రాణించలేదు. దిల్లీలో టీ20లో 41 పరుగులు మినహా మిగతా మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయాడు. ఇక సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తన సొంత జట్టు దిల్లీ తరఫున బరిలోకి దిగి పూర్తిగా నిరాశపరిచాడు. 24, 35, 19, 9, 0.. చివరి ఐదు మ్యాచ్‌ల్లో అతడి పరుగులివి. రోహిత్‌తో జత కలిస్తే చెలరేగిపోయే ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ ప్రపంచకప్‌ తర్వాత సరిగ్గా ఆడలేకపోతున్నాడు. దీంతో అతడు కోలుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ప్రపంచకప్‌లో ధావన్‌ లేని లోటును కేఎల్‌ రాహుల్‌ పూరించాడు. రోహిత్‌ శర్మతో కలిసి మిగిలిన మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఓపెనింగ్‌ చేసి శుభారంభాలు అందించాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినా నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో వరుసగా 57, 30, 48, 0, 77, 111 పరుగులు చేశాడు. ధావన్‌ గనక ఫామ్‌లోకి రాకుంటే అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు రాహుల్‌ సిద్ధంగా ఉన్నాడు. మంచి స్ట్రోక్‌ప్లే, అద్భుతమైన టెక్నిక్‌ అతడి సొంతం. గబ్బర్‌ త్వరగా ఫామ్‌ అందుకోకపోతే సంజు శాంసన్‌ రూపంలోనూ ముప్పు ఎదురుకానుంది.

Related posts