తెలంగాణలో ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కామారెడ్డికి చెందిన 25 ఏళ్ల శరణ్య బెంగళూరులోని ఓ సంస్థలో పనిచేస్తోంది. శరణ్యది ప్రేమవివాహం. తనతో పాటు కలిసి చదివిన రోహిత్ ను ప్రేమించి పెళ్లాడింది. రోహిత్, శరణ్య బెంగళూరులోనే ఉంటున్నారు. అయితే తన ఇంట్లో శరణ్య విగతజీవిగా పడివుండగా ఆ సమాచారం అందుకున్న ఆమె తల్లిదండ్రులు వెంటనే బెంగళూరు పయనమయ్యారు.
తమ కుమార్తె మరణానికి అల్లుడు రోహితే కారణమని ఆరోపిస్తున్నారు. అతడు ఆత్మహత్య చేసుకునేంత స్థాయిలో వేధించడమో కారణం అయ్యుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే రోహిత్ తమ కుమార్తెపై చేయి చేసుకునేవాడని వారు వెల్లడించారు. ఇటీవలే శరణ్య పుట్టింటికి వస్తే, పెద్ద మనుషులను సమక్షంలో రోహిత్ తప్పు ఒప్పుకున్నాడని తెలిపారు. అతడు మారాడని భావించి శరణ్యను మళ్లీ కాపురానికి పంపామని వివరించారు. ఇంతలోనే తమ కుమార్తె మరణ వార్తను వినాల్సి వస్తుందనుకోలేదని వారు శోక సంద్రంలో మునిగిపోయారు.