బ్యానర్: యు.వి.క్రియేషన్స్
నటీనటులు: ప్రభాస్, శ్రద్ధాకపూర్, నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు
దర్శకత్వం : సుజిత్
నిర్మాతలు : వంశీ, ప్రమోద్
సంగీతం : తనిష్క్ బగ్చి, గురురంద్వా, బాద్షా, శంకర్ ఎహ్‌సాన్‌లాయ్
బ్యాగ్రౌండ్ స్కోర్ : జిబ్రాన్
సినిమాటోగ్రఫీ : ఆర్.మది
ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్
“బాహుబలి”తో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన ప్రభాస్ తాజాగా నటించిన పాన్ ఇండియా మూవీ “సాహో”. ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో 350 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ తారలతో తెరకెక్కడం, హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ హాలీవుడ్ సినిమాను తలపించాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సాహో”తో ప్రభాస్ అభిమానులను మెప్పించాడా ? “సాహో” ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ మరింత పెరిగిందా ? అనేది తెలుసుకుందాం.
కథ :
ముంబైలో ఓ దొంగ చిన్న క్లూ కూడా వదలకుండా రెండు వేల కోట్ల రూపాయల భారీ దొంగతనానికి పాల్పడతాడు. ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ డేవిడ్ (మురళీశర్మ), కానిస్టేబుల్ గోస్వామి (వెన్నెలకిషోర్)లకు అప్పగిస్తారు. కానీ వారు ఆ దొంగను కనిపెట్టలేకపోతారు. దీంతో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్)ను నియమిస్తారు. ఈ కేసులో జై (నీల్ నితిన్ ముఖేష్)నే దొంగ అనే విషయం తెలుసుకుంటాడు అశోక్. జైను సాక్ష్యాధారాలతో పట్టుకోవడానికి అతడితో స్నేహం చేస్తాడు అశోక్. అప్పుడు అమృతానాయర్ (శ్రద్ధాకపూర్)కి డ్యూటీ వేస్తాడు. అమృతనాయర్ ను అశోక్ ప్రేమిస్తాడు. అనుకోకుండా ఓసారి తాగిన మత్తులో అశోక్ కు జై ఓ క్లూ ఇస్తాడు. మరోవైపు సిటీలో పెద్ద డాన్ రాయ్ (జాకీ ష్రాఫ్)ను కొందరు చంపేస్తారు. ఆయన స్థానంలో డాన్ అయిన ఆయన తనయుడు విశ్వాంక్ (అరుణ్ విజయ్) తండ్రిని చంపిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. రాయ్ ని ఎవరు చంపారు ? రాయ్ కు అశోక్ కు ఉన్న సంబంధం ఏంటి ? జై ఇచ్చిన క్లూ ఏంటి ? అశోక్ ఆ దొంగను సాక్ష్యాధారాలతో సహా పట్టుకోగలిగాడా ? ఆ కేసుని చేధించే క్రమంలో అశోక్ ఎలాంటి రిస్క్ లను ఎదుర్కొన్నాడు ? సినిమాలో అసలు ట్విస్టులేంటి ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు :
ప్రభాస్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నటన ఏంటో “బాహుబలి”తో ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా రిస్కులను ఎదుర్కొన్నాడని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. యాక్షన్ సన్నివేశాల్లోనూ, రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ప్రభాస్ అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్ శ్రద్ధాకపూర్ గ్లామర్ సినిమాకు పెద్ద ప్లస్. నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్, వెన్నెలకిషోర్, మురళీశర్మ, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, చుంకీపాండే, లాల్, మందిరాబేడి, మహేశ్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, షాసా చెట్రి తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో ఉన్న నటీనటులందరూ ప్రముఖులు, సీనియర్లు కావడంతో వారి నటప్రతిభ ఏంటో అందరికీ తెలిసిన విషయమే.
సాంకేతిక వర్గం పనితీరు :
ప్రభాస్ అభిమానుల అంచనాల మేరకే హీరో, నటీనటులు, సాంకేతిక నిపుణులు భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో “సాహో” సినిమాను రూపొందించారు. “బాహుబలి” తరువాత ఒకే ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడు సుజిత్ తో ప్రభాస్ సినిమా ఒప్పుకోవడమంటే మామూలు విషయం కాదు. సినిమాలోని హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతం. అయితే సినిమాలో ఈ ఎమోషన్ పార్ట్ సినిమాలో అంత ఎఫెక్టివ్‌గా లేదనిపిస్తుంది. సినిమా ప్రథమార్థం నెమ్మదిగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ బావుంది. కానీ సెకండాఫ్‌లో వరుస ట్విస్టులతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. పాటల చిత్రీకరణ అద్భుతంగా ఉంది. అయితే అవి హిందీ నుంచి డబ్ చేసిన పాటల్లా అన్పిస్తయి. జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. మది కెమెరా వర్క్ అద్భుతం. నిర్మాణ విలువలు సినిమా రేంజ్ కు తగ్గట్లుగా ఉన్నాయి. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతమేరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి.
రేటింగ్ : 3/5