telugu navyamedia
క్రీడలు వార్తలు

రికార్డు సృష్టించిన పంత్…

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో పంత్‌ ఆరో ర్యాంకు సాధించాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ను పంత్‌ వెనక్కి నెట్టి ఆరో స్థానం దక్కించుకున్నాడు. ఇంతకుముందు 9వ స్థానంలో ఉన్న పంత్.. మూడు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. అతడికే ఇదే అత్యుత్తమ ర్యాంక్. 23 ఏళ్ల వయసులోనే పంత్‌ ఈ ఘనత సాధించడం విశేషం. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-10లో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ చోటు దక్కించుకోవడం భారత క్రికెట్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. భారత వికెట్‌ కీపర్‌ ఈ ఫార్మాట్‌లో సాధించిన అత్యధిక ర్యాంకింగ్‌ కూడా ఇదే. అంతకుముందు ఆస్ట్రేలియా, ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన పంత్‌.. ర్యాంకింగ్‌ పాయింట్లను మెరుగుపరచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గత కొద్ది రోజులుగా అన్ని ఫార్మాట్లలో పంత్ పరుగుల వరదపారిస్తున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీసులను భారత్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్‌తో పాటు హెన్రీ నికోల్స్‌-7, రోహిత్‌ శర్మ-8 కూడా 747 రేటింగ్‌ పాయింట్లతో టాప్-10లో ఉన్నారు.

Related posts