టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఆయన వాహనాన్ని వైసీపీ నేతలు అడ్డుకొని దాడిచేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లో కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరివేయించారన్నారు. పోలీసుల సమక్షంలోనే రాళ్లు, దాడులు చేయడం దుర్మార్గమని అనంతపురం టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలవ మాట్లాడుతూ విశాఖపట్టణంలో ప్రజా చైతన్య యాత్రకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకుని దాడులు చేయడం బాధాకరమన్నారు.
జగన్ కుర్చీ శాశ్వతం కాదని తెలుసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటన్నారు. వైసీపీ ముసుగులో పులివెందుల రౌడీలు వచ్చి విశాఖలో ఇది ట్రయల్ రన్ దాడి చూపించారన్నారు. మమ్ములను కాదన్నా… మేము చెప్పినట్లు వినకపోయినా ఇదే శాస్తి జరుగుతుంది.. చంద్రబాబుకే దిక్కులేదు… మీకెవరు దిక్కు అంటూ విశాఖ ప్రజలను బెదిరింపుకు ఈ దాడి చేశారన్నారు.