అధికబరువు నేడు పిల్లలతో ప్రారంభమై.. పెద్దలదాకా అత్యంత భయానక సమస్య అయ్యింది. అయితే దీని బారిన పడిన వారు బరువు తగ్గాలి అని చేయని ప్రయత్నాలు ఉండవు, కాకపోతే వాటిలో నిజాయితీ పాళ్ళు కాస్త తక్కువనే చెప్పాలి.. దానికి బలమైన కారణాలు లేకపోలేదు. శరీరం బరువు తగ్గించుకోవడం అన్నది ఎంతో మందికి మహా యజ్ఞమైపోయింది. అయితే, బరువు పెరగడానికి దారి తీసే వాటిలో పిండి పదార్థాలే (కార్బోహైడ్రేట్లు) అతి పెద్ద కారణమనే నిజాన్ని చాలా మంది గుర్తించడం లేదు. నిజానికి, ఆహారంలో వాటి నిష్పత్తిని గణనీయంగా తగ్గిస్తే శరీరం బరువు అనతి కాలంలోనే తగ్గిపోతుంది. కానీ, చాలా మందికి అదే సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా అన్నం, చపాతీలకు విపరీతంగా అలవాటు పడిన ప్రాణం, అవి లేని ఆహారం తీసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడదు. ఇతరమైనవి ఎన్ని తిన్నా, చివరగా మళ్లీ అన్నం తినాల్సిందే! పైగా, పిండి పదార్థాలు త్వరత్వరగా అరిగిపోవడం వల్ల మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఫలితంగా ఏమవుతుంది? అవీ ఇవీ కలిసి శరీరం బరువు మునుపటి కన్నా మరికాస్త పెరుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలనే బలమైన కాంక్ష ఏదైనా ఉంటే సహజమైన ఇష్టాఇష్టాలను కట్టడి చేయాల్సిందే.
పిండిపదార్థాలు అనేవి తగ్గించడం సరే గానీ, వాటి స్థానాన్ని వేటితో నింపాలి? అన్న ప్రశ్నకు, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్లు ఒక సైంటిఫిక్ సెషన్‌లో సమాధానం చెప్పారు. అందులో ప్రధానంగా బాదాం, జీడిపప్పు, వేరు శనగల వంటి పిడికెడు గింజ దాన్యాలు రోజూ తీసుకోవాలని స్పష్టం చేశారు. గింజ దాన్యాలలో ప్రొటీన్ ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా కడుపు నిండినట్లయి, పిండి పదార్థాల వైపు పెద్దగా మనసు వెళ్లదు. ఇదొక కారణమైతే, కార్బోహైడ్రేట్లతో పోలిస్తే వృక్ష సంబంధమైన ఈ తరహా ప్రొటీన్‌లకు బరువు పెంచే గుణం తక్కువ. ఏ రకంగా చూసినా పిండిపదార్థాలను బాగా తగ్గించుకుని గింజదాన్యాలు తినడం బరువు తగ్గే మంచి మార్గమని ఇటీవలి ఈ అధ్యయనాలు స్పష్టం చేశాయి. కాకపోతే గింజ ధాన్యాలను తీసుకునే క్రమంలో ఫైబర్ కోసం కీరా లాంటివి విధిగా తీసుకోవాలి. లేదంటే మలబద్దకం ఏర్పడి మరో కొత్త సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు.
వైఎస్ జగన్ అవినీతి రాజ్యానికి రాజు: ఎమ్మెల్సీ అశోక్ బాబు