telugu navyamedia
తెలంగాణ వార్తలు

నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెడతాం-చండూరు సభలో నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి

*పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణ‌పాఠం చెప్పాలి..
*మునుగోడు గ‌డ్డ‌పైన ఎగిరేది కాంగ్రెస్ జెండానే..
*న‌మ్మిన నాయ‌కురాలిని న‌య‌వంచ‌న చేసిన రాజ‌గోపాల్‌రెడ్డిని బుద్ధి చెప్పాలి
*మునుగోడు గ‌డ్డ‌పై రాజ‌గోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి నిప్పులు

నమ్మిన నాయకురాలిని, భుజాన మోసిన కార్యకర్తలను నట్టేట ముంచి పక్క పార్టీలో చేరిన వాళ్లకు బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. జిల్లాలోని చండూరులో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ..మునుగోడులో కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా.. గంటలో దామోదరెడ్డి వస్తారని, రెండు గంటల్లో తాను వస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు.

సోనియా గాంధీని ఈడీ అధికారులు హింసిస్తుంటే .. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా పంచన చేరాడని రేవంత్ మండిపడ్డారు.

సోనియా కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన చేస్తుంటే.. కాంట్రాక్టుల కోసం అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నాడని ఆయన మండిపడ్డారు. అసలు రాజగోపాల్ రెడ్డి మనిషేనా అంటూ ఫైరయ్యారు

ఉపఎన్నికల్లో ఓడినంత మాత్రాన.. కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఏదైనా ఊడిందా?. 2018 తర్వాత నాలుగు ఉప ఎన్నికల్లో రెండు టీఆర్‌ఎస్‌, రెండు బీజేపీలు గెలిచాయ్‌. ఒక ఎమ్మెల్యే పదవి పోయినా కాంగ్రెస్‌కు పోయేది ఏమీ లేదు.

వర్షానికి పారిపోయే వారు కాంగ్రెస్ కార్యకర్తలు కాదన్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే విజయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు గడ్డ మీద అయితే కమ్యూనిస్ట్ పార్టీ జెండా.. లేదంటే కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు.

ఈ ప్రాంతానికి చెందిన సీపీఐ, సీపీఎం కార్యకర్తలు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని రేవంత్ ప్రశంసించారు. జానారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మాధవరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారంలో లేకున్నా పనులు చేయలేదా అని ఆయన గుర్తుచేశారు. దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వనప్పటికీ ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి తిరిగి కాంగ్రెస్‌లోనే చేరారని రేవంత్ తెలిపారు.

అలాగే 2018 ఎన్నికల్లో టికెట్ దక్కనప్పటికీ పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ విజయం కోసం శ్రమించారని ఆయన గుర్తుచేశారు. వందల ఎకరాల భూములు కరిగిపోయినా కాంగ్రెస్ పార్టీ జెండాను పాల్వాయి గోవర్థన్ రెడ్డి విడిచిపెట్టలేదని రేవంత్ కొనియాడారు. ఆరు దశాబ్ధాల తెలంగాణ కలను సోనియా గాంధీ నెరవేర్చారని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేక మోదీ.. ఈడీని ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించారు రేవంత్‌. నేను కాంగ్రెస్‌ తరపున పోరాడుతున్నా కాబట్టే నాపై కేసులు పెడుతున్నారు. జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి కింద ఏం పని చేయాలని రాజగోపాల్‌రెడ్డి అంటున్నాడు. నేను 30 రోజులు జైల్లో ఉంటే.. అమిత్‌ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. అమిత్‌షా పక్కన ఉన్నప్పుడు.. నా పక్కన నిలబడటానికి నీకేం నొప్పి వచ్చింది.

అధికారంలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయా?. ఉప ఎన్నికలతో మునుగోడు అభివృద్ధి అవుతుందనుకుంటే ..కాంగ్రెస్‌ నుంచి పోటీ చెయ్‌. ఎన్నో పదవులు ఇచ్చిన కాంగ్రెస్‌నే రాజగోపాల్‌రెడ్డి మోసం చేశాడు. ఇవాళ కాంగ్రెస్‌ను మోసం చేసినవాడు.. రేపు మళ్లీ మోసం చేయడా?. తెలంగాణ సంస్కృతి అమ్ముడుపోయే సంస్కృతి కాదు.. సాయం చేసే సంస్కృతి. ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల పైనే ఉంది. ప్రజలంతా కాంగ్రెస్‌ పక్కన నిలబడండి. నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు గడ్డపై పాతిపెడతాం అంటూ ఆగ్రహం వెల్లగక్కారు రేవంత్‌రెడ్డి.

Related posts