సాంకేతిక రంగం కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆన్ లైన్ చెల్లింపులు, కొనుగోళ్ళు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాటికి తగట్టుగానే మోసాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఓ యాప్ ను వాడితే ఖాతాలో డబ్బులు మాయమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి యాప్ ల పై అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచించింది. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) మాధ్యమంగా ఆన్ లైన్ చెల్లింపుల సేవలందిస్తున్న ‘ఎనీ డెస్క్’ స్మార్ట్ ఫోన్ యాప్ ను వాడరాదని ఆర్బీఐ హెచ్చరించింది.
‘ఎనీ డెస్క్’ వ్యవస్థపై మోసాలు జరుగుతున్నాయంటూ బ్యాంకులు, యాప్ వాడకందారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ యాప్ ద్వారా డబ్బు మాయం అవుతోందని పేర్కొంది. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వినియోగదారుల ఫోన్లను తమ ఆధీనంలోకి తీసుకొని, వారి ఖాతాల్లోని డబ్బును దుండగులు మాయం చేస్తున్నట్టు తేలిందని వెల్లడించింది. ఈ మేరకు ఆర్బీఐ సైబర్ భద్రత, ఐటీ పరిశోధన విభాగం ఓ ప్రకటనను విడుదల చేస్తూ, మొబైల్ వ్యాలెట్ లు, బ్యాంకింగ్ యాప్ లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని తెలిపింది.