telugu navyamedia
క్రీడలు వార్తలు

సొంత మైదానంలో అశ్విన్ నెలకొల్పిన రికార్డులు…

చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేశాడు. స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన 81వ ఓవర్ ఐదవ బంతికి బౌండరీ బాదిన అశ్విన్ శతకం చేశాడు. 134 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 100 పరుగులు చేశాడు. అశ్విన్‌కు టెస్టుల్లో ఇది ఐదవ సెంచరీ కావడం విశేషం. ఇంగ్లండ్‌పై అశ్విన్‌కు తొలి టెస్టు సెంచరీ కాగా.. అంతకుముందు చేసిన నాలుగు సెంచరీలు వెస్టిండీస్‌పైనే సాధించాడు.సెంచరీ చేసిన కొద్దిసమయానికి ఓలి స్టోన్ బౌలింగ్‌లో యాష్ బోల్డ్ అయ్యాడు. ఇక అశ్విన్ సెంచ‌రీ చేయ‌డంతో ఇండియ‌న్ టీమ్‌కు 481 పరుగుల భారీ లీడ్ దక్కింది. వరుస బౌండరీలతో చెలరేగిన రవిచంద్రన్ అశ్విన్ సొంత మైదానంలో సెంచరీ చేసి.. రెండో టెస్ట్ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మలచుకున్నాడు. చెన్నైలో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఇక చెపాక్ స్టేడియంలో సెంచరీ చేసిన రెండో తమిళనాడు ఆటగాడిగా కూడా అశ్విన్ రికార్డులోకి ఎక్కాడు.

1986/87 సీజన్‌లో టీమిండియా మాజీ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. పాకిస్థాన్‌పై శ్రీకాంత్ 123 రన్స్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో 8వ స్థానంలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా యాష్ నిలిచాడు. డేనియల్ వెట్టోరి 4 శతకాలు బాధగా.. ఆశ్విన్ 3 చేశాడు. కమ్రాన్ అక్మల్ కూడా మూడు బాదాడు. ఆర్ అశ్విన్ మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడంతో పాటు వంద పరుగులు చేసిన బౌలర్‌ల జాబితాలో యాష్ రెండో స్థానానికి చేరాడు. ఇయాన్ బోథమ్ ఐదు సార్లు ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో పాటు వంద పరుగులు చేశాడు. ఈ జాబితాలో గ్యారీ సోబర్స్, ముష్తాక్ మొహమ్మద్, జాక్వెస్ కల్లిస్, షకీబ్-అల్-హసన్ మూడో స్థానంలో ఉన్నారు. వీరందరూ రెండేసి సార్లు ఐదు వికెట్లతో పాటు వంద పరుగులు సాధించారు.

Related posts