కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశానికి అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ కార్యక్రమాలకు ఆయన వరుసగా గైర్హాజరు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకాకపోవడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా రాహుల్ గాంధీ దూరంగా ఉన్నారు.
ఇప్పుడు ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం వంటి ముఖ్యమైన కార్యక్రమానికి కూడా ఆయన దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ తీరుపై తీవ్రంగా స్పందించారు.
“వ్యక్తిగత విహారయాత్రల కోసం మలేషియా వంటి దేశాలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది కానీ, దేశ గౌరవాన్ని చాటే ఇలాంటి అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడానికి సమయం ఉండదా?” అంటూ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ తీరు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అగౌరవాన్ని తెలియజేస్తోందని విమర్శించారు.
దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని, రాజ్యాంగబద్ధ పదవుల ప్రమాణ స్వీకారాన్ని గౌరవించని వ్యక్తి ప్రజా జీవితంలో కొనసాగడానికి అర్హులా? అని ఆయన ప్రశ్నించారు.
రాహుల్ చర్యలు భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఆయన వైఖరి దేశ వ్యతిరేక ధోరణిని ప్రతిబింబిస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

