telugu navyamedia
సినిమా వార్తలు

రెండు అరటి పండ్లు రూ.442… సీరియస్ అయిన ప్రభుత్వం

Rahul-Bose

సాధారంగా మనం అరటి పండ్లను డజన్ల లెక్కలోనే కొంటుంటాము. అయితే అరటిపండ్లను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉండొచ్చు. కొన్ని రకాల అరటి పండ్లకు మాత్రం కాస్త రేటు ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతమేలు చేస్తాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓ బాలీవుడ్ హీరో ఇప్పుడు అరటిపండ్లు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. ఎందుకంటే ఆయన తీసుకున్న రెండు అరటి పండ్ల రేటు ఆయనతో ఇలా చెప్పేస్తోంది. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌ షూటింగ్ నిమిత్తం చండీగఢ్ వెళ్లిన రాహుల్ అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశాడు. జిమ్‌కు వెళ్లొచ్చి రెండు అరటి పండ్లకు ఆర్డర్ ఇచ్చాడు. పండ్లతోపాటు వచ్చిన బిల్లు చూసి నోరెళ్లబెట్టాడు. వాటిపై ఏకంగా రూ.442.50 బిల్లుండడంతో హీరోగారి మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే కాసేపటి తర్వాత బిల్లు సంగతి ఏంటా అని పరిశీలించి చూడగా, సెంట్రల్ జీఎస్టీ కింద రూ.33.75, యూటీ జీఎస్టీ కింద మరో రూ.33.75 వేసి మొత్తం బిల్లును రూ.442.50గా చూపించారు. దాంతో తాను రెండు అరటిపండ్లు తిన్నానని వాటి రేటు దిమ్మతిరిగేలా ఉందని, అరటిపండ్లు కూడా ఆరోగ్యానికి హానికరమేనని ట్వీట్ చేశాడు రాహుల్ బోస్‌. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవడంతో చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ అండ్ ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ కమిషనర్ మణిదీప్ సింగ్ బ్రార్ స్పందించారు. అత్యధిక ధరతోపాటు చట్టవిరుద్ధంగా అత్యధిక జీఎస్టీ వసూలు చేసిన హోటల్ మారియట్‌పై దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తులో తప్పు తేలితే హోటల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజా పండ్లు, కూరగాయలు అసలు జీఎస్టీ పరిధిలోకి రాకపోవడం ఇక్కడ కొసమెరుపు.

Related posts