telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్ దర్శకుల సంక్షేమం ట్రస్ట్… రాజమౌళి భారీ విరాళం

TDFA

తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం మే 4న దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తద్వారా సంఘ సభ్యులలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆరోగ్య, విద్య మరియు కుటుంబ అవసరాలకి సహాయం చేసే విధంగా ఒక నిధిని ఏర్పాటు చేసుకుని, తద్వారా వచ్చే వడ్డీతో అర్హులైన వారికి తోడ్పాటు అందించేలా ఆయన ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రస్తుత దర్శకుల సంఘ ప్యానెల్ సత్సంకల్పం, మిగతా అందరి దర్శకుల సహాయ, సహకారాలతో 24/7/2019 ట్రస్ట్‌ని రిజిస్టర్ చేయడం జరిగిందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెలిపారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్‌కు కె. రాఘవేంద్రరావు చైర్మన్‌గా.. ఎన్. శంకర్ (మేనేజింగ్ ట్రస్టీ), వివి వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ (ట్రెజరర్), కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్ర‌సాద్‌, కాశీ, బి.వి.ఎస్‌.ర‌వి ట్రస్టీలుగా ‘టి.ఎఫ్.డి.టి’ (తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్) ఆవిర్భావం జరిగింది. విరాళాల సేకరణ, సహాయ నిధిని త్రికరణ శుద్ధిగా సభ్యుల అత్యవసర అవసరాలకి అందించే విధంగా ‘టి.ఎఫ్.డి.టి’ని ముందుకు తీసుకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. ‘టి.ఎఫ్.డి.టి’కి మరింత మెరుగైన భవనం, లైబ్రరీ, ఫంక్షన్ హాల్, దర్శకత్వశాఖలో ప్రావీణ్య తరగతులు, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడానికి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుకుంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్రస్ట్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ముందుగా ఈ ట్రస్ట్‌కు దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి 50 లక్షలు భూరి విరాళం అందించారు. రాఘవేంద్రరావు 10 లక్షలు, ఆర్కే మీడియా వారు 15 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియపరిచేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ట్రస్ట్ ఆలోచనని మెచ్చి 25 లక్షలు ప్రకటించారు.

Related posts