telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గాన గంధర్వా… నీ స్వరానికి పద్మవిభూషణమనే అలంకారం

SPB

గాన గంధర్వా
నీ స్వరానికి
పద్మవిభూషణమనే
అలంకారం
మహదానందం,
సంగీతప్రపంచానికి
మరో మకుటం!!
ఎన్నిరాగాలు పలికిన
గాత్రమయ్యా నీది?
ఎన్ని పల్లవులు
పెనవేసుకున్న
ప్రపంచమయ్యా-
నీ సంగీత లోకం?
గాత్రమధురిమకోసం
ఎన్ని ప్రయోగాలు చేశావో,
ఎన్నెన్ని కష్టాలు పడ్డావో,
అన్నీ దాటుకుని
కోట్లహృదయాలను
కొల్లగొట్టావు కదయ్యా!!
నీ సంగీత మధురిమలు
ఆ రక్కసి కరోనా కు
అసూయ కలిగించిందా?
చిన్నారి పొన్నారి లను
లాలించిన నీ లాలిపాట,
నిస్తేజాన్ని తరిమికొట్టే
నీ ఉత్తేజపు పాటలు,
ఆధ్యాత్మికతకు మరో
పేరు గా నిలిచే
నీ భక్తి గీతాలు,
కరోనా ను కనికరించలేదా?
పై వాడి మనసు కరగలేదా??
మరణంలేని
నీ గాత్రానికి
పద్మవిభూషణం
నీ కీర్తి కిరీటంలో మరో
కలికితురాయి-
నీ జీవిత చరిత్రలో
ఒక మైలురాయి.
మరణం నీరూపానికే-
ఉర్రూతలూగించే
నీపాట ఎన్నటికీ
అజరామరమే,
అమృతమయమే!!
పాట ఉన్నంతవరకు
పాతపడని గాత్రమహిమ నీది.
లక్షల నోళ్ళు శ్లాఘించిన
గాత్ర గరిమ నీ స్వంతం
అది శాశ్వతం!!

Related posts