ఎవరు మేము..(వేశ్య)
ఎవ్వరు మేము ఎవ్వరు మేము
రక్త మాంస కళేబరనికి రంగులద్దుకున్న
యువతులం మేము..
మాంగల్యబంధానికి నోచని పడతులం మేము..
దేశమాత పెదవిపైన మాసిన చిరు నవ్వుల పువ్వులం మేము..
మనసులేని మనుషుల పిడికిలిలో నలిగి
నేలకొరిగిన పసివాడిన మొగ్గలం మేము..
ఆకలి కడుపుకోతకు అమ్ముడుపోయిన
అపరంజి అంగడిబొమ్మలం మేము..
చెక్కిలి వన్నెలు చెదరని చిగురాకుల
కొమ్మలం మేము..
కామాంధుల విషపుకోరల కౌగిలి మధ్యనపడి
నలిగి మోడై నిలిచిన పడకటింటి
పడతులం మేము..
పొరపాటున అబలలుగా పుట్టి విధివంచితలైనాము
బుసకొట్టే కామానికి విసిరేసిన సమిధులమైనము
ఆశ..నిరాశల జీవితాల వెలుగుకై నిత్యం కాలుతున్న చీకటి చితిమంటల్లో నడిచే జీవచ్చవలమైనము..
చీకటి రాజ్యాన కన్నెలమే వెలుగు జీవితాన పసిపాపలనుగాన్న వింత తల్లులమైనము..
రొమ్ము క్రింద మమతలను దాచుకొని అనుకున్న
పసిపిల్లలకు ప్రేమ పంచలేని పాలవెల్లులమైనము..
వంచనకు గురైన మంచానికి అంకితమై
కామాంధుల విస్తరిలో పంచభక్షమై
నడి వీధినపడి కుక్కలు చింపిన ఎంగిలి విస్తరైనము..
కసి దాగిన కళ్ళతో.. సలసల మరిగే కన్నీళ్లతో
బంధాలు తెగి బరువెక్కిన గుండెతో
నవ్వలేక..ఏడ్వలేక.. జీవించలేక
నిట్టూర్చే శవాలం మేము..
నోరు మెదపలేని జీవచ్ఛవలం మేము..
ఎవరో కాదు మేము ఇంకెవరో కాదు మేము
ఆ జాలిలేని దేవుడు సృష్టించిన పడతులం మేము
ఈ మనుషులు దిగజార్చిన పతితులం మేము
మీ రక్తంపంచుకు పుట్టిన ఆడపడుచులం మేము
మీరు జారవిడుచుకున్న జాతి పరువులం మేము
కళంకితం అంటుకున్న వీధి కళంకితలం మేము
మానాన్ని కోల్పోయిన మణిపూసలం మేము