telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రాయబారంలా… నీ ఉత్తరం

నువ్వూరెళ్ళినప్పుడు
నేను ఇక్కడే ఒంటరిగా
నీ రాకకోసం (నీ ప్రేమ లేఖకోసం) ఎదురు చూస్తూ…
ఇప్పటిలా అప్పుడు
“దునియా ముట్టీ మే” లేదుకదా..!
సరస సంభాషణ అయినా
విరహ వేధన అయినా
శుభ సందేశం అయినా
ధు:ఖ కారణమైనా
ఆరోజుల్లో ఉత్తర రాయబారాలేగా…
పక్షి రాయబారంలా
నీ ఉత్తరం కోసం పోస్ట్ మెన్ ఎప్పుడు తెస్తాడా
అని పడిగాపులు పడిన ఆ రోజులు…
ఆరోజు ఉత్తరం రాలేదంటే
మరో వరహా విరహం
ఎక్కువ కొనుక్కొన్నట్టుగా…
చాలా చేదుబిళ్ళ చప్పరిస్తున్నట్టుగా
నా మోములో ఆ భావం ప్రతిఫలిస్తుంటే
చూచే వారికి నా ప్రేమరోగం
ఇట్టే తెలిసిపోతూ ఉండేది…
ఇక ఉత్తరం వచ్చిందంటే
నువ్వే వచ్చేసినట్టుగా
ముచ్చట తెచ్చేసినట్టుగా
కొత్త పెళ్ళికూతురిని
ముసి ముసి నవ్వులతో చూసుకొన్నట్టుగా
పదే పదే ఆ ఉత్తరాన్ని చూచుకొంటూ…
నువ్వు చెయ్యందిస్తే
నిన్ను సందిట్లోకి చేర్చుకొని
నా గుండెలకు ఆనించుకొంటున్నట్టు
ఆ ఉత్తరమే నువ్వనుకొంటూ
ముద్దుల మీద ముద్దులు పెడుతుంటే
నీకు ఊపిరాడనట్లుగా
ఆ ఉత్తరం విలవిలలాడిపోతున్నట్టుగా నలిగిపోతుండేది…
ఆ తాకిడికి
నీరశించిపోతున్న ప్రియురాలికి
ఔషధ సేవనం చేయింస్తున్నట్టు
ఆ ఉత్తరాన్ని మెత్తగా సవరించి
ఆనాడు నీవిచ్చిన పుస్తకపు పొత్తిళ్ళ మధ్య
కోమాలో ఉన్న ప్రియురాలికి
ముద్దుల ఆక్సీజన్తో నిత్యం ఊపిరి అందిస్తున్నట్టుగా
ఇప్పటికీ సజీవంగా భద్రపర్చి ఉంచాను…
ఎప్పుడైనా ఇటొస్తే నన్ను కలువు
మన ఉత్తరాల సాక్షిగా
అప్పటి నిన్ను
ఇప్పటి నాలో
అప్పటి నీలా
ఇప్పటికీ నీకు నిన్ను మళ్ళీ చూపించేస్తాను…

Related posts