నడక నీవు నా నడత నీవు
భరోసా నీవు భద్రత నీవు
భవిష్యత్తుకు వ్యూహకర్త నీవు
దాని సాకారానికి సాయకర్త నీవు
శిక్షణ నీవు శిక్షకుడవు నీవు
భుజాలపై ఎక్కించుకుని తిప్పేది నీవు
భుజం తట్టి ప్రోత్సహించేది నీవు
చిన్నప్పుడు నా లోకం నీవు
పెద్దయ్యాక లోకం నన్ను గుర్తించేలా చేసేది నీవు
నేనున్నాననే నేస్తం నీవు
నేనే నీ సమస్తం అనుకునేవు నీవు
కోరింది కొనిచ్చేది నీవు
గొంతెమ్మ కోరికలకు కళ్ళెం నీవు
అండవు నీవు దండన నీవు
అందరివాడవు నీవు
కొందరికే అర్థమయ్యేవాడవు నీవు
కరుగుతూ వెలుగునిస్తావు నువ్వు
అరుగుతూ మెరుగుదిద్దేవు నువ్వు
అణచివుంచిన అనురాగం నీవు
అణగద్రొక్కని కోపం నీవు
రోషం నీవు పౌరుషం నీవు
ఇంటికి ఆధారం నీవు
నా కనుపాపల కనురెప్పవు నీవు
గంభీరము నీవు
దానివెనుక కనపడని సంబరం నీవు
అందమైన పూల మాలకి పనికివచ్చే పువ్వులా తయారుచేస్తావు నువ్వు
దారంలా దాక్కుంటావు నువ్వు
నా ప్రగతికి మొదటి చిరునవ్వు నీవు
ఆ చిరునవ్వును దాచుకునే ప్రయత్నం నీవు
ఆటుపోట్లకు అడ్డుగోడ నీవు
కుటుంబాన్ని ఒడ్డున చేర్చేందుకు ఆహరహరము శ్రమించే శ్రమవు నీవు
కష్టాలను దిగమింగే గరళకంఠుడివి నువ్వు నాకా సెగను కూడా తగలనివ్వని సంరక్షకుడివు నువ్వు
నువ్వు నువ్వే నాకు నువ్వే
నన్ను నన్నుగా ప్రేమించే నాన్నవు నువ్వే
అమ్మవారిలో కూడా అమ్మను వెతుక్కోవచ్చేమో కానీ
నాన్న మాత్రం ఒక్కడే ఒకే ఒక్కడే