తెలంగాణలో రాగల మూడు రోజులకు వాతావరణ సూచన, హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈరోజు ఉపరితల ఆవర్తనము, మరాఠ్వాడ పరిసరాలపై సముద్రమట్టానికి 1.5 కి. మీ వరకు విస్తరించి ఉందని.. తూర్పు – పశ్చిమ ఉపరితల ద్రోణి సుమారుగా 14°N అక్షాంశం వెంబడి సముద్రమట్టానికి 3.1 కి మి నుంచి 7.6 కి. మీ మధ్య ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. ఇది మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయివరకు వ్యాపించి ఉంది. రేపు ఉదయానికి అదే ప్రదేశంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఇది ఉత్తర – వాయువ్యదిశగా కదిలి, బలపడి మే 24 నాటికి తుఫానుగా, తరువాత 24 గంటలలో చాలా తీవ్రమైన తుఫానుగా మారుతుంది. ఇది ఉత్తర – వాయువ్యదిశగా కదులుతూ, మరింత బలపడి, పశ్చిమ బెంగాల్ సమీపంలోని ఉత్తర బంగాళాఖాతానికి, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాలకు 26 వ తేదీ ఉదయం చేరుకుంటుంది. ఇది 2021 మే 26 సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, దాని ప్రక్కనే ఉన్న ఉత్తర ఒడిశా & బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది.