టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి చెందారు. విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్‌కు తరలిస్తారు. శుక్రవారం మహా ప్రస్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి.
హీరోయిన్ గా నటిస్తూ డైరెక్షన్ చేసి సొంతంగా నిర్మించి ఘన విజయాలు సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల గారు. మీనా, కవిత, రౌడీ రంగమ్మ, కలెక్టర్ విజయ, పిన్ని, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి చిత్రాలు అందుకు సాక్ష్యాలు. నటసామ్రాట్ ANR, నడిగర్ తిలకం శివాజి గణేశన్, సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ రజినీకాంత్ వంటి హేమాహేమీల్ని డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయనిర్మల గారు.
విజయనిర్మల మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి వెంకయ్యనాయుడు ప్రకటించారు. విజయనిర్మల మృతి చెందారన్న వార్త తెలిసి ఎంతో విచారించానని ఆయన పేర్కొన్నారు. బాలనటిగా తెలుగు సినీరంగంలో ప్రవేశించి ఉన్నతశిఖరాలు అధిరోహించారన్నారు. రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు సహా ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయని కొనియాడారు. అత్యధిక సినిమాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల.. తెలుగు సినీ రంగంలో మహిళల ప్రాధాన్యతను పెంచారని వెంకయ్యనాయుడు ప్రశంసించారు.
ఆమె మృతికి ఏపీసీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విజయ నిర్మల మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని ప్రార్దించారు.
విజయ్ నిర్మల మృతికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. “సీనియర్ నటి విజయనిర్మలగారి మరణం దిగ్భ్రాంతికరం. నటిగానే కాక దర్శకురాలిగా అనేక కుటుంబ కథాచిత్రాలను అందించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ,వారి అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని అన్నారు.
విజయ నిర్మల మృతి పట్ల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు అని ఆయన అన్నారు. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు విజయ నిర్మల చేశారని పలువురు ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ విజయనిర్మల మృతిపై స్పందించారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. నిర్మాత, దర్శకురాలిగా తన కొత్తదనాన్ని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. విజయనిర్మల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి మురళీమోహన్ సానుభూతి తెలిపారు. విజయనిర్మలను పనిరాక్షసి అనేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.
తన ఆరోగ్యంపై అమితాబ్ షాకింగ్ కామెంట్స్