పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు తమకు ఎలాంటి నివేదిక రాలేదని కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. దీనిపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని, సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజనచట్టంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీనికి వంద శాతం నిధులను కేంద్రం భరిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పోలవరంలో 60 శాతం వరకు పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇంతవరకు జరిగిన ఈ పనులు, పునరావాస కార్యక్రమంలోగానీ, ఇతర ప్యాకేజ్‌ల్లో అవినీతి జరగినట్టు తమకు నివేదిక రాలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.