telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

లోకం తీరు

ఆధాటున వస్తాయి అవి, ఈ పార్శ్వపు నొప్పులు
ఎప్పటివో పాత ప్రేమలలాగా,
మరి ఇక ఒక పట్టాన వదలవు అవి నిన్ను –

నిన్నో చోట నిలకడగా నిలబడనివ్వవు, అలాగని
నింపాదిగా కూర్చోనివ్వవు,
ఉన్నచోటే నిన్ను పొట్టుగా చెక్కే ఈ ప్రేమలు,

కణతల మధ్య నిన్ను నువ్వు నొక్కిపట్టుకున్నట్లు
అతి ప్రయాసతో వాటిని
ఆపుదామని అనుకుంటావు కానీ, అంతా

వృధా ప్రయాస! ప్రతి చిన్న అలికిడీ నీలో చేరి ఇక
నీ నొప్పిని ద్విగుణీకృతం
చేసినట్లు, ఈ చలిరాత్రీ, గాలీ, ఇంకా నువ్వు!
*
అధాటున వస్తాయి అవి, ఈ పార్శ్వపు నొప్పులు
గతించని ప్రేమలలాగా, ఒక
కొత్త ఎరుకని నీకు అందిస్తూ. ఆ నొప్పి వల్లనే

నీకు ‘నువ్వు’ ఉన్నట్లు తెలిసి వచ్చిందనీ, లోకం
ఈ మనుషులూ ఉన్నారనీ,
ఔషధం వాళ్లేననీ, ఎంత నొప్పితోనైనా సరే,

వాళ్ళని ప్రేమిస్తో బ్రతకడంలో తప్పేం లేదనీ!

Related posts