ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరవాత ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. అయితే, ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీ వస్తోంది. పాయల్ రాజ్‌పుత్ ఐపీఎస్ అధికారిణిగా నటించిన ఈ చిత్రానికి ‘5Ws’ అనే టైటిల్‌ను పెట్టారు. 5Ws అంటే ఏమిటో అందరికీ తెలిసిందే.. who, what, when, where, why (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). ‘సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు’ అనేది ఉపశీర్షికగా పెట్టారు. గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ కిశోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.
కార్యక్రమంలో భాగంగా పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘‘ఇన్నాళ్లూ ఈ సినిమా గురించి మౌనంగా ఉన్నాను. ఇకపై మాట్లాడవచ్చు. నాకు, నా కెరియర్‌కి కంప్లీట్‌గా కొత్త సినిమా ఇది. పోలీస్, ఐపీఎస్ రోల్ చేయాలని ప్రతి యాక్టర్ కలలు కంటారు. మొత్తానికి అటువంటి గోల్డెన్ ఛాన్స్ నాకు వచ్చింది. నాపై, నా నటనపై నమ్మకం, విశ్వాసం ఉంచిన ప్రణదీప్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఐపీఎస్ రోల్ చేయడం ఛాలెంజింగ్. నేను బాగా చేశానని అనుకుంటున్నా. టాలెంటెడ్ టీమ్‌తో ఈ సినిమా చేశా. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా? అని ఎదురుచూస్తున్నా. తాను ఈ పాత్ర చేయడానికి విజయశాంతి స్ఫూర్తి అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. ‘‘ప్రణదీప్ నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా అంగీకరించా. ఈ పాత్ర చేయడానికి నాకు విజయశాంతి గారు స్ఫూర్తి. ఆమె నటించిన చాలా సినిమాలు చూశాను. ఆవిడ పోలీస్ పాత్రలు చాలా చేశారు. ఈ ‘5Ws’లో కొత్తగా చేసే అవకాశం నాకు లభించింది. నేను ఏ సినిమా చేసినా కొంత హోమ్ వర్క్ చేస్తా. నా ఫ్రెండ్ సర్కిల్‌లో కొంతమంది పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి వాళ్ళతో డిస్కస్ చేశా’’ అని పాయల్ వెల్లడించారు. కాగా, ఈ కార్యక్రమంలో మాటల రచయిత శివకుమార్, సినిమాటోగ్రాఫర్ అనిల్ బండారి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. వెంకట్ మాస్టర్ స్టంట్స్ డిజైన్ చేశారు.