ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటిస్తున్నారు. నరసింహపురంలో అతిపెద్ద తాగునీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేసారు. ఇది 12 ఎకరాల్లో రూ.1,290 కోట్లతో చేపట్టబోయే పథకం. దీంతో 31 మండలాల్లోని 1,387 గ్రామాలకు నీటి కష్టాలు తీరనున్నాయి.
ప్రకాశం జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి కష్టాలతో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, ఆ సమస్య తీవ్రత తనకు బాగా తెలుసని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలివ్వనున్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపైనా అభిప్రాయాలు తెలుసుకుంటారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ,”నా చిన్నప్పుడు సుమారు రెండేళ్ల పాటు ఈ ప్రకాశం జిల్లాలోనే ఉన్నాను. ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో నివసించేవాళ్లం.
అక్కడి నీటిలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉందని, దానివల్ల మోకాళ్లు, వెన్నెముకలు వంగిపోయే ప్రమాదం ఉందని తెలియడంతో, కేవలం 6 నెలల్లోనే మా కుటుంబం ఆ ఊరు విడిచి వెళ్లిపోయింది” అని పవన్ వివరించారు.
అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య కొనసాగడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్లోరైడ్ సమస్య కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందుకే ఈ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
తాను ఎదుర్కొన్న సమస్యను ఇప్పుడు ప్రజాప్రతినిధిగా పరిష్కరించే అవకాశం రావడంపై పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా వీరాంజనేయస్వామి, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


ప్రజలు ఇంగ్లీష్ ను కోరుకోవడంతో ప్రతిపక్షాల యూటర్న్: మంత్రి బొత్స