కోవిడ్–19 మహమ్మారి కారణంగా గత సంత్సరంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు అన్నీ మూతపడ్డాయి. చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌లోనే పాఠాలు వింటున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని, ఇది విస్మరించలేని తీవ్రమైన విషయమని పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టం చేసింది. విద్యార్థులను నాలుగు గోడలకే పరిమితం చేయొద్దని, వీలైనంత త్వరగా పాఠశాలలు పునఃప్రారంభించాలని, వారిలో మేధోవికాసానికి బాటలు వేయాలని ప్రభుత్వానికి సూచించింది.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు వినయ్ పి.సహస్రబుద్ధే నేతృత్వంలో విద్య, మహిళలు, చిన్నారులు, యువత, క్రీడలపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తన నివేదికను శుక్రవారం పార్లమెంట్‌కు సమర్పించింది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. స్కూళ్ల మూసివేత వల్ల తలెత్తే విపరిణామాలు విస్మరించలేనంత తీవ్రమైనవని తేల్చిచెప్పింది. కుటుంబాల సామాజిక జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఇంటి పనుల్లో పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంది. వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించింది. చిన్నారులు ఇళ్లకే పరిమితమై ఉంటే తల్లిదండ్రులు, వారి మధ్య ఉన్న సంబంధాలు సైతం ప్రభావితమవుతాయని వెల్లడించింది. దేశంలో బాల్య వివాహాల సంఖ్య కూడా పెరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గుర్తించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను తెరిచే ఆలోచన చేయాలని ఉద్ఘాటించింది.
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలల సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ వేగంగా పూర్తిచేసి, పాఠశాలలు తెరవొచ్చని సూచించింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్యను తగ్గించడానికి రెండు షిఫ్టుల్లో క్లాసులు నిర్వహించాలని తెలిపింది. పిల్లలను సెక్షన్లుగా విభజించి, రోజు విడిచి రోజు క్లాసులు నిర్వహించవచ్చని సూచించింది. ప్రతి పాఠశాలలో కనీసం రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేయాలని, పిల్లలకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వైద్య సాయం అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
తనను ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ లు ఏకమయ్యాయి: కవిత