భారత్‌లో దాడులు జరిపి అలజడి సృష్టించేందుకు ఉగ్రవాద సంస్థల సాయంతో పాక్ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోంది. ఈమేరకు పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు, ఖలిస్థాన్ ఉగ్రవాదులతో ఐఎస్‌ఐ కీలక భేటీలు జరిపినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఇస్లామాబాద్‌లోని ఐఎస్‌ఐ, ఆర్మీ కార్యాలయాల్లో ఈ భేటీలు జరగ్గా.. లష్కర్, జైష్, హిజ్‌బుల్, ఖలిస్థాన్ కీలక నేతలు హాజరయినట్లు తెలుస్తోంది. దాడుల కోసం ఖలిస్థాన్ ఉగ్రవాదులు జమ్మూలోని తమ మద్దతుదారుల సాయం కోరినట్లు నిఘావర్గాల సమాచారం.
ఇరాన్‌లోని మషాద్‌లో పాక్ దౌత్యకార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లను స్థానిక పోలీసులు తొలగించారు. కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో పాక్ ఈ బ్యానర్లను ఏర్పాటు చేయగా దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ దేశంలోని దౌత్య కార్యాలయాలను మూడో దేశానికి వ్యతిరేకంగా వినియోగించనీయబోమని తేల్చిచెప్పింది. ‘ఇస్లామాబాద్‌లోని మా దౌత్య కార్యాలయం వద్ద సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా బ్యానర్లు పెడితే మీరు అంగీకరిస్తారా?’ అని నిలదీసింది. ‘పాక్ మాకు సోదర దేశం.. అలాగని భారత్ మాకు శత్రువు కాదు. కశ్మీర్ భారత్ అంతర్గత విషయమన్న మా వైఖరి ఏ మాత్రం మారదు’ అని ఇరాక్ స్పష్టం చేసినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.

