ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రమూకలపై భారత వైమానిక దళం దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే తమ అనుమతి లేకుండా తమ పరిధిలో ఉన్న భూభాగం లోకి భారత సైన్యం రావడం పై పాక్ ప్రతీకారానికి దిగాలని ప్రయత్నించి, విఫలం అయ్యాయి. కాగా, భారత్ చేసిన దాడిలో దాదాపు 350 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజాగా భారత్ దాడికి ప్రతీకారంగా పాక్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి దూసుకొచ్చాయి. జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ లో పాక్ యుద్ధ విమానాలు ఈరోజు ఉదయం చక్కర్లు కొట్టాయి. ‘మీరు భారత గగనతలంలోకి ప్రవేశించారు. వెంటనే వెనక్కి వెళ్లిపోండి’ అని అధికారులు హెచ్చరించినా పాక్ ఫైటర్ జెట్లు వెనక్కి తగ్గలేదు.
దీనితో గస్తీ నిర్వహిస్తున్న భారత యుద్ధ విమానాలు రంగంలోకి దిగగానే పాక్ ఫైటర్ జెట్లు తోక ముడిచాయి. ఈ విషయపై భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. పాక్ భారత గగనతలాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో లేహ్, జమ్మూ, శ్రీనగర్, పఠాన్ కోట్ ఎయిర్ పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టులో పౌర విమానాల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు ఈరోజు పాక్ బలగాలు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాలపై మోర్టార్లు, ఆటోమేటిక్ తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించాయి. దీనితో భారత బలగాలు కూడా పాక్ కాల్పులకు దీటుగా జవాబిచ్చాయి.