ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పెడుతూ స్పష్టమైన సందేశం పంపారు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని, ఒడిశా ప్రజల కోసం జరుగుతున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నానని, ఎటువంటి వదంతులు నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ‘నవీన్ జెట్ ఇంజిన్’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో నవీన్ వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు. నవీన్ ఆరోగ్యంపై వదంతులు రావడంతో బీజేడీ నేతలు ఈ వీడియోను షేర్ చేశారు.
వీడియో ద్వారా నవీన్ మాట్లాడుతూ ‘నా ఆరోగ్యంపై బీజేపీ నేతలే వదంతులు సృష్టిస్తున్నారు. కొందరైతే నా ఆరోగ్యం పూర్తి విషమంగా ఉందని, ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నానని పుకార్లు పుట్టిస్తున్నారు. అందుకే ఎన్నికల వేళ ఈ వీడియో విడుదల చేయడం తప్పనిసరని భావించి రిలీజ్ చేస్తున్నాను’ అంటూ ముగించారు.

