మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి విషయంలో గెజిట్ నోటిఫికేషన్ గురించి మళ్ళీ గర్జించారు. ఆయన ఇప్పటికి ఇదే విషయం పదే పదే చెబుతున్నా టీడీపీ నేతల నుంచి సమాధానం చెప్పలేకపోతుంది. వారు అమరావతి రాజధాని అంటున్నారు. కానీ అధికారిక రాజపత్రం మాత్రం విడుదల చేయలేకపోయారు. మరి చంద్రబాబు లాంటి అనుభవశాలి, పాలనాపరంగా అన్ని విషయాలు తెలుసు అని చెప్పుకునే పెద్దాయన, మూడు మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నేతకు ఇంత చిన్న విషయం తెలియదా లేకపోతే తెలిసినా అవసరంలేదనుకున్నారా. రాజధాని పేరిట భూకుంభకోణం జరిగింది, అది స్థానిక ప్రజలు సహా అందరూ గ్రహించాలి. గెజిట్ నోటిఫికేషన్ లేకపోతే అది అమరావతి రాజధాని అని ఎలా అంటారు అని బొత్స ప్రశ్నించారు.
అధికారిక పత్రం లేకుండానే దానికి సంబంధించిన పనులను రాజధాని పేరిట అని ఎలా చెబుతారు. ఈ విషయంలో బొత్స వ్యక్తం చేస్తున్న అనుమానాలకు అయిదు నెలలు అయినా టీడీపీ పెద్దల నుండి సరైన క్లారిఫికేషన్ రాలేదంటే అమరావతి అన్నది నోటిపైన ఉంది తప్ప కాగితాలలో లేదన్న మాట స్పష్టం అవుతుంది. బొత్స అన్ని లెక్కలు తీసి మరీ అక్కడ ఒకే సామాజికవర్గానికి పెద్ద ఎత్తున భూ సంతర్పణ చేశారని చెబుతున్నారు. దీనికి కూడా సరైన సమాధానం లేదు. నిజానికి ఒక రాజధాని ఎలా ఉండాలి. మొత్తం ప్రజల ప్రతిబింబంలా ఉండాలి. పదమూడు జిల్లాల్లో వందల సామాజిక వర్గాలు జీవిస్తున్నాయి. అందరికీ అమరావతిలో ప్రాతినిధ్యం ఉందా. దీనికి కూడా బొత్స చెబుతున్నారు. ఒక్కటే సామాజికవర్గం చంద్రబాబు బంధువులకు, అస్మదీయులకే అక్కడ భూ సంతర్పణ చేశారని అంటున్నారు. అదే విధంగా అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, రాజధాని ప్రకటన వచ్చిన తరువాతనే భూములు టీడీపీ నేతలు కొన్నారని చెబుతున్నారు. ఈ విషయంలో తాను సవాల్ చేస్తున్నానని, ఎక్కడైనా చర్చకు వస్తానని బొత్స అంటున్నారు. దీనికి కూడా టీడీపీ ఎప్పుడూ సమాధానం చెప్పలేకపోయింది.
ఏటా రూ.8 వేల కోట్లు దుబారా.. వైసీపీ సర్కార్ పై యనమల ధ్వజం