మహారాష్ట్ర కూటమి ప్రభుత్వంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విమర్శలు గుప్పించారు. సీఏఏకి మద్దతుగా బీజేపీ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడిన పార్టీల మధ్య సైద్ధాంతిక సారూప్యతలు లేవని పేర్కొన్నారు. అదో అపవిత్ర కూటమని, కూలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులను వెళ్లగొట్టాలంటూ అప్పట్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే అన్నారని పేర్కొన్నారు. ఇప్పుడు బాల్‌థాకరేకు వ్యతిరేకంగా ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టారు. మరాఠా, హిందుత్వ అస్థిత్వాన్ని వీడితే శివసేన తమ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని గడ్కరీ హెచ్చరించారు.

