telugu navyamedia
క్రీడలు

ఒలిపింక్స్‌లో నెరవేరిన భారత్ వందేళ్ల ‘బంగారు’ కల

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ వందేళ్ల స్వప్నం సాకారమైంది. జావెలిన్ త్రోలో నీర‌జ్ చోప్రా ప‌సిడి పథకం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో అథ్లెటిక్స్ లో తొలి మెడల్ సాధించిన ఆటగాడిగా నీర‌జ్ చోప్రా రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కు మొదటి బంగారు పతకం వచ్చింది. అభినవ్ బింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు నీర‌జ్. ఈ పథకం తో భారత్ ఖాతాలోకి మొత్తం 7 పథకాలు వచ్చాయి. గతంలో 2000 ఏడాది విశ్వక్రీడల్లో భారత్ కు అత్యధికంగా 6 పతకాలు వచ్చాయి. ఈసారి ఒక స్వర్ణం రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తం 7 పథకాలు సాధించిన భారత్ ప్రస్తుతం పథకాల పట్టికలో 47వ స్థానంలో ఉంది.

అందరూ ఊహించినట్టుగానే నీరజ్ చోప్రా అద్భుతం సాధించాడు. మహామహులు, అనుభవజ్ఞులు, ఫేవరెట్లను వెనక్కి నెట్టారు. భారత్ కీర్తి పతాకను అత్యున్నత శిఖరాలలో రెపరెపలాడించేలా చేశాడు. అందరికన్నా మెరుగ్గా ఆడుతూ ఈటెను 87.58 మీటర్లు విసిరి భారత్‌కు స్వర్ణం అందించాడు. మొదటి అవకాశంలోనే నీరజ్ 87.03 మీటర్లు విసిరి ఆశ్చర్య పరిచాడు. ఆ తర్వాత తన రికార్డును మరింత మెరుగు పరుచుకుంటూ ఈసారి ఈటెను 87.58 మీటర్లు విసిరి పతక పోటీలో ముందుకెళ్లాడు.పోటీల్లో పాల్గొన్న అథ్లెట్లలో అత్యధిక మీటర్లు విసిరిన ఆటగాడిగా నిలిచాడు. నీరజ్ తర్వాత చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్(86.67) మీటర్లు విసిరి రజతం గెలిచాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రాకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Related posts