మంత్రి నారా లోకేశ్, ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ (రాధా) ఈరోజు సమావేశం అవుతున్నారు.
సుమారు 11 నెలల విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అవుతుండటంతో, ఈ సమావేశం వెనుక ఉన్న అజెండా ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
నారా లోకేశ్ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు వంగవీటి రాధా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వంగవీటి రాధా, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
తనకు టికెట్ కేటాయించకపోయినా, రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించి కూటమికి మద్దతుగా నిలిచారు.
ఈ భేటీలో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై నారా లోకేశ్ నుంచి స్పష్టమైన హామీ లభించవచ్చని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.
రాధాకు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు? ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చకు రానున్నాయి? అనే విషయాలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ భేటీ తర్వాత రాధా రాజకీయ ప్రస్థానంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.