telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాశి ఫలాలు సామాజిక

వికారి నామ సంవత్సరం .. ఎవరికి ఎలా ఉండబోతుందంటే.. !

Indian new year forecasting and celebrations

తెలుగు సంవత్సరాది ఉగాది రేపే. రేపటి రోజున భారతీయులకు నూతన సంవత్సరాది.. ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరానికి కూడా ఒక పేరు పెట్టారు.. అదే ‘వికారి’నామ సంవత్సరం. ఈ రోజు ముఖ్యంగా ప్రాతః కాలం నందే తలస్నానం వంటి కార్యక్రమాలు ముగించుకొని, పూజా కార్యక్రమాలలో మునిగిపోతారు. ఈ రోజున షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నివేదించిన అనంతరం అందరూ సేవిస్తారు. సకల రుచుల సమ్మేళనంతో ఉన్న ఈ పదార్థ సేవనంలో కూడా భారతజాతి ధర్మభూమికి తగ్గట్టుగా ఎంతో గొప్ప ఆచారం దాగి ఉంది. జీవితం అంటే ఒక్క తీపి మాత్రమే కాకుండా అన్ని రకాల అనుభవాలతోనూ ఉంటుందని, వాటిని అన్నిటిని ఒకేరకంగా తీసుకోవాలని అందులో దాగిన రహస్యం. అది తెలుసుకొని జీవితాన్ని తగ్గట్టుగా మలచుకుంటే, అంతకంటే భక్తి మరొకటి అవసరం లేదు. ఇక నేడు చేసే మరో కార్యక్రమం పంచాంగ శ్రవణం. ఈ కార్యక్రమంతో నేటి ఉత్సవాలు ముగుస్తాయి.

ఈ నూతన తెలుగు సంవత్సరాదిన ఎవరికి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా ఉంటుంది. ఆ ఫలితాలు జన్మనక్షత్రం అనుసరించి, ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మేషరాశి : (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం : 14 వ్యయం : 14 రాజపూజ్యం : 3 అవమానం : 6
ఈ ఏడాది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పైచదువులు, విదేశీ గమనానికి అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం. రాజకీయ, కళ, సినీ, రక్షణ, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. ఆరోగ్యం మెరుగవుతుంది. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. శ్రీ వికారినామ సంవత్సరంలో వృశ్చిక, ధనూ రాశుల్లో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పుల కోసం ప్రయత్నిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నవంబర్‌ 5 నుంచి న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యరంగంలోని వారికి పురోగతి కనిపిస్తుంది. ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 మధ్య విద్యార్థుల చదువులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. న్యాయ సంబంధిత వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఈ ఏడాది శని 9వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉల్లాసంగా వుంటుంది. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మే 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు శని వక్రగమనంలో వున్నందున పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. వృత్తిపరంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల విషయాల పట్ల అధిక శ్రద్ధ చూపాలి. బంధుమిత్రులతో అపార్థాలు వచ్చే అవకాశం వుంది. కర్కాటక, మిథునాల్లో రాహు సంచారం ఫలితంగా పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. మనశ్శాంతి లోపిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. ఉద్యోగంలో స్థల మార్పిడికి అవకాశం వుంది. వేరే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతగా ఫలించకపోవచ్చు. 9, 10 స్థానాల్లో కేతు సంచారం ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తులు పెంపొందించుకుంటారు. మీ పురోగతి చూసి అసూయపడే వారు అధికమవుతారు. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని మాటపడతారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం వారు జాగ్రత్త వహించాలి. ఆలస్యాలు, ఆటంకాలు మీ ఓరిమిని పరీక్షిస్తాయి. దుర్గాదేవి ఆరాధన వల్ల దోషాలు తొలగి, పురోగతి సాధిస్తారు.

వృషభరాశి : (కృత్తిక 2,3,4; రోహిణి; మృగశిర 1,2పాదాలు)ఆదాయం : 8 వ్యయం : 8 రాజపూజ్యం : 6 అవమానం: 6
ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. కంపెనీ వాటాల విలువ పెరుగుతుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో నిదానం పాటించాలి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. ఈ ఏడాది వృశ్చికం, ధనుస్సు రాశుల్లో గురుసంచారం ఫలితంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభాలను చేకూరుస్తుంది. విద్యార్థులకు శుభప్రదమైన కాలం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఆస్తులు పెంపొందించుకుంటారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురువు వక్రగమనంలో వున్న ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 మధ్య కాలంలో వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం వుంది. ఉన్నత చదువుల్లో మొదట ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. అనవసర వివాదాలకు దూరంగా వుండాలి. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది ధనుస్సు రాశిలో శని సంచారం జరుగుతుంది. మీ చంద్ర రాశి నుంచి అది 8వ స్థానం. ఫలితంగా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్‌ అందుకుంటారు. పాతబకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో పురోగతి నిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. మే 1 – సెప్టెంబర్‌ 19 తేదీల మధ్య వ్యాపారంలో ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. క్రయవిక్రయాల్లో నిదానం అవసరం. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. ఎవరినైనా నమ్మి డబ్బు ఇస్తే అది తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. పై చదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వెన్నునొప్పి బాధిస్తుంది. 3 – 9 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా బదిలీలకు అవకాశం ఉంది. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. ఈ ఏడాది ప్రఽథమార్థంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా సంవత్సరాంతంలో పరిస్థితి మెరుగవుతుంది. ఉన్నత చదువుల్లో పట్టుదలతో శ్రమించి సత్ఫలితాలు సాధిస్తారు. ఓరిమితో వ్యవహరిస్తే విజయం మీ సొంతం అవుతుంది. శ్రీఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

మిథునరాశి : (మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు) ఆదాయం : 11 వ్యయం : 5 రాజపూజ్యం : 2 అవమానం : 2
ఈ ఏడాది వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పెట్టుబడుల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. ఉన్నత చదువులకై చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం. ఈ ఏడాది మీ చంద్ర రాశి నుంచి 6, 7 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 12 వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడుల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఉన్నత విద్యా విషయంలో ఆటంకాలను అధిగమించి లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సప్తమ స్థానంలో శని సంచారం ఫలితంగా వైవాహిక జీవితంలో చికాకులు ఎదురయ్యే అవకాశం వుంది. అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విలాసాలకు ఖర్చులు చేయడం మానాలి. బంధు మిత్రుల నుంచి మాటపడాల్సి వస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. మే 1 – సెప్టెంబర్‌ 19 మధ్య వేడుకలు, శుభకార్యాలకు అవకాశం వుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. గుండె, నేత్ర సంబంధమైన సమస్యలు బాధిస్తాయి. 2 – 8 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఈ ఏడాది దూరంగా ఉండటం శ్రేయస్కరం. వ్యాపార రంగంలో అంచనాలు తలకిందులవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఆస్తిపాస్తుల విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. డబ్బు సహాయం చేస్తే సకాలంలో తిరిగి రాక ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం వుంది. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త అవసరం. శ్రీ సూర్యనారాయణుడి ఆరాధన వల్ల శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి : (పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష) ఆదాయం : 5 వ్యయం : 5 రాజపూజ్యం : 5 అవమానం : 2
ఈ సంవత్సరం వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. పెద్దల సలహాలతో కృషి రంగంలో విజయం సాధిస్తారు. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రుణభారం తగ్గుతుంది. సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. 5- 6 స్థానాల్లో గురువు సంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీలోని సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 మధ్య ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంది. శని ఈ సంవత్సరమంతా 6వ స్థానంలో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శని వక్రించిన మే 1 – సెప్టెంబర్‌ 19 తేదీల మధ్య పెట్టుబడుల్లో నష్టం సంభవించే అవకాశం వుంది. రుణబాధలు అధికం అవుతాయి. వ్యాపార రంగంలోని వారికి నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా వుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ యేడాది 1 – 7 స్థానాల్లో రాహు కేతు సంచారం ఫలితంగా వివాహ బంధం బలపడుతుంది. భాగస్వామి వల్ల ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు. రుణబాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ నరసింహ స్వామి ఆరాధనతో సత్ఫలితాలొస్తాయి.

సింహరాశి : (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం) ఆదాయం : 8 వ్యయం : 14 రాజపూజ్యం : 1 అవమానం : 5
ఈ సంవత్సరం స్థల సేకరణ, గృహనిర్మాణ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల వారు పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైన కాలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది 4, 5 స్థానాల్లో బృహస్పతి గ్రహం సంచరిస్తుంది. ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 తేదీల మధ్య రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఈ ఏడాది మీ చంద్ర రాశి నుంచి 5వ స్థానంలో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భారీ వ్యాపారానికి, కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరాశకు గురవుతారు. శని వక్రగమనంలో వున్న మే 1 – సెప్టెంబర్‌ 19 తేదీల మధ్య వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, కేటరింగ్‌, రిటైల్‌, హోటల్‌ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం. ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. 12 – 6 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం కారణంగా ప్రమోషన్‌లు అందుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు ఆందోళనగా ఉంటుంది. వాహనాలు నడిపే సమయంలో నిదానం అవసరం. విలాస ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. గణపతి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

కన్యారాశి : (ఉత్తర 2,3,4; హస్త; చిత్త1, 2 పాదాలు) ఆదాయం : 11 వ్యయం : 5 రాజపూజ్యం : 4 అవమానం : 5
ఈ ఏడాదిలో ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. గతంలో చేసిన శ్రమకు ప్రతఫలం అందుకుంటారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రచురణ, మార్కెటింగ్‌, రవాణా, కన్సల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. గురువు ఏప్రిల్‌- అక్టోబర్‌ మాసాల మధ్య వృశ్చికంలో మిగిలిన నెలల్లో ధనుస్సులో సంచారం చేస్తాడు. ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. సోదరీసోదరులు, బంధువుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాల్లో చిన్నపాటి మార్పులు చేస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం చేస్తూ పైచదువులు చదివేందుకు అనుకూలం. గురువు వక్రించిన ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 తేదీల మధ్య వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలించకపోవచ్చు. గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. వాగ్వివాదాలకు దూరంగా వుండాలి. ఈ ఏడాది మీ చంద్ర రాశి నుంచి 4వ స్థానంలో శని గ్రహ సంచారం కారణంగా ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం వుంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. శని వక్రించిన మే 1 – సెప్టెంబర్‌ 19 తేదీల మధ్య ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. వాహనం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. 11, 5 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనసంతా చికాకుగా ఉంటుంది. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు. షేర్లు, భాగస్వామ్యాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ రామచంద్రుని ఆరాధన వల్ల లాభం కలుగుతుంది.

తులారాశి : (చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు) ఆదాయం : 8 వ్యయం : 8 రాజపూజ్యం : 7 అవమానం : 1
ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభకార్యాలకు అవకాశం వుంది. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించాలి. మీ చంద్ర రాశి నుంచి 2, 3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. అనుబంధాలు బలపడతాయి. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 తేదీల మధ్య గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాల్లో నిదానం పాటించాలి. మీ చంద్ర రాశి నుంచి 3వ స్థానంలో శని సంచారం ఫలితంగా కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇల్లు, స్థలం కొనుగోలు చేస్తారు. కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు అధికం. సంతానం విషయాలు ఆందోళన కలిగిస్తాయి. విద్యార్థులకు చదువుల పట్ల అఽశ్రద్ధ పెరుగుతుంది. విలాసాలకు వెచ్చిస్తారు. శని వక్ర గమనంలో ఉన్న మే 1 – సెప్టెంబర్‌ 19 తేదీల మధ్య ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం. కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. 10, 4 స్థానాల్లో రాహు కేతువుల సంచారం ఫలితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహ, బాంధవ్యాలు పెంపొందుతాయి. విలాసాల పట్ల ఆసక్తి చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో ప్రయత్నించి చివరకు విజయం సాధిస్తారు. ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. విలాసాలకు ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తులు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది.

వృచ్చికరాశి : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) ఆదాయం : 14 వ్యయం : 14 రాజపూజ్యం : 3 అవమానం : 1
ఈ ఏడాది అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆక స్మిక ధనలాభం కలుగుతుంది. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. ఉన్నత చదువులు, విదేశీ యానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వైద్య, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య అశాంతికి లోనవుతారు. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో ఆ తరువాత రెండవ స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం కొంత మందగించే అవకాశం వుంది. బదిలీలకు అవకాశం వుంది. బాంధవ్యాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఆస్తిపాస్తులు పెంపొందించుకుంటారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. గురువు వక్రించిన ఏప్రిల్‌ 11 – ఆగస్టు 12 తేదీల మధ్య ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ చూపాలి. కొత్త వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చంద్ర రాశి నుంచి 2వ స్థానంలో ఈ ఏడాది శని సంచారం జరుగుతుంది. ఫలితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు అధికం. ఆర్థిక విషయాల్లో నిదానం పాటించండి. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం కారణంగా మాటపడాల్సి వస్తుంది. డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బందిపడతారు. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారంలో మొదట ఇబ్బందులు ఎదురైనా చివరకు మంచి ఫలితాలు సాధిస్తారు. శని వక్రగమనంలో ఉన్న మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. కాళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. 9 – 3 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త వహించాలి. విదేశీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు అధికం. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతి కలిగిస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సోదరీసోదరులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

ధనస్సురాశి : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం) ఆదాయం : 2 వ్యయం : 8 రాజపూజ్యం : 6 అవమానం : 1
ఈ ఏడాది ఆర్థిక పురోగతి సాధిస్తారు. ప్రమోషన్‌లు, కోరుకున్న చోటకు బదిలీలు అందుకుంటారు. గృహ నిర్మాణ, స్థలసేకరణ చేస్తారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. స్నేహానుబంధాలు బలపడతాయి. శుభకార్యాలు జరుగుతాయి. క్రీడలు, పరిశోధన, విద్యా రంగాల వారికి విజయం చేకూరుతుంది. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్‌ రంగాల వారికి శుభప్రదం. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. గురువు ఈ ఏడాది వ్యయస్థానంతో పాటు చంద్ర రాశిలో సంచారం చేస్తాడు. ఫలితంగా విలాసాలకు, దూరప్రయాణాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. రాజకీయ నేతలకు అనుకూలమైన కాలం, ఉన్నత పదవులు అందుకుంటారు. రాజకీయ, సినీరంగాలకు చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. టెక్స్‌టైల్స్‌, ఎగుమతులు, రవాణా, ఉన్నత విద్యారంగాల వారికి అనుకూలం. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 12 వరకు ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికమవుతాయి. ఆదాయం పెరిగినా డబ్బు మాత్రం చేతిలో నిలవదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు ఖర్చు చేస్తారు. చంద్ర రాశిలో శని సంచారం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని పనుల్లో అటంకాలు ఎదురవుతాయి. మనసు చంచలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోతారు. ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. బదిలీ కోసం మీరు చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరుల ఆర్థిక విషయాలలో తలదూర్చి అనవసరమైన చిక్కుల్లో పడతారు. మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు ఆలస్యాలను, వైఫల్యాలను లెక్కచేయకుండా ప్రయత్నాలు కొనసాగించి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. షుగర్‌ సమస్య బాధిస్తుంది. 8-2 స్థానాల్లో రాహు, కేతువుల సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తగవు. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు ఏమాత్రం అనుకూల సమయం కాదు. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. గృహ నిర్మాణ వ్యవహారాలకు ఆటంకాలు ఎదురవుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

మకరరాశి : (ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు) ఆదాయం : 5 వ్యయం : 2 రాజపూజ్యం : 2 అవమానం : 4
ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి, విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సంతానం విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలలో వున్నవారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. అక్టోబర్‌ నుంచి టెక్స్‌టైల్స్‌, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్‌, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. విదేశీ గమనానికి, విదేశాలలో చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 12 తేదీల మధ్య పెద్దల ఆరోగ్యం మందగించే అవకాశం వుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ ఏడాది మీ 12వ స్థానంలో శని సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. తీర్థయాత్రలు, దానధర్మాలకు, విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సలహాలతో ముందడుగు వేయాలి. మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు శని వక్రించిన ఫలితంగా ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. 7-1 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో నెమ్మది పాటించాలి. ఆర్థిక విషయాల్లో, ఇతరులకు సాయం చేసే విషయంలో ఒకటి రెండుసార్లు అలోచించాలి. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్టే అవకాశం ఉంది. చికాకులు కారణంగా ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. శ్రీ పార్వతీదేవి ఆరాధ న సత్ఫలితాలను ఇస్తుంది.

కుంభరాశి : (ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3పాదాలు)ఆదాయం : 5 వ్యయం : 2 రాజపూజ్యం : 5 అవమానం : 4
ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఖర్చులు అధికం అవుతాయి. గురువు ఈ ఏడాది 10, 11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 12 వరకు బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందరపాటు నిర్ణయాలు తగవు. మీ చంద్ర రాశి నుంచి 11వ స్థానంలో శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధు మిత్రుల కారణంగా బాధ్యతలు అధికం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉదర సంబంధమైన సమస్యలు బాధిస్తాయి. 6-12 స్థానాల్లో రాహు కేతువుల సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణబాధలు అధికమవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. శ్రీ దక్షిణామూర్తి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

మీనరాశి : (పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం : 2 వ్యయం : 8 రాజపూజ్యం : 1 అవమానం : 7
ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. వాహనం సమకూర్చుకుంటారు. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలం. షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. మీ చంద్ర రాశి నుంచి 9, 10 స్థానాల్లో గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తగిన సమయం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రక్షణ, కన్సల్టెన్సీ, ఆడిటింగ్‌ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతానప్రాప్తికి అనుకూలం. కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పునకు అనుకూలం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సలహాలు, సహకారంతో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 12 వరకు గురువు వక్రించిన కారణంగా మీ పురోగతి చూసి అసూయపడే వారు పెరుగుతారు. పెట్టుబడుల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యం. బదిలీలు అసౌకర్యం కలిగిస్తాయి. ఈ ఏడాది మీ చంద్ర రాశి నుంచి 10వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. జీతభత్యాలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయు. పైఅధికారుల ప్రశంసలు అందుకుంటారు. మే 1 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు శని వక్రించిన కారణంగా స్వయంకృషి, కార్యదీక్ష, ఓరిమి, ఏకాగ్రత, నిదానం, పట్టుదలతో అవరోధాలను అధిగమించి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు. గుండెకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. 5-11 స్థానాల్లో రాహు కేతువుల సంచారం వల్ల రుణ బాధలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులు లక్ష్యసాధన కోసం అధికంగా శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో ఒత్తిళ్ల కారణంగా రాజీనామా దాకా వెళతారు. ఓరిమి వహిస్తే క్రమంగా పరిస్థితి సర్దుకుంటుంది. శ్రీకృష్ణుడి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

గమనిక : ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ అంటే మిగులు ఉంటుంది అనేది తెలిసిందే. ఇక ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అంటే అప్పు చేసైనా ఇళ్లు, వ్యాపార విస్తరణ తదితర కార్యక్రమాలు చేపడతారని అర్ధం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ ఉందంటే శత్రువులు తక్కువ అని అర్ధం; రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువ ఉందంటే శత్రువులు ఎక్కువ అని, తగ్గట్టుగా జాగర్తలు తీసుకోవాలని అర్ధం చేసుకోవాలి. 

Related posts