వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని చదవకుండా యాక్సెప్ట్ చేసేశారా? దాని వల్ల మీ ప్రైవసీకి కలిగే భంగం ఏంటో తెలుసా? మీ డేటాను వాట్సప్ ఎలా ఉపయోగించుకోబోతుందో… మీ డేటాను ఫేస్‌బుక్‌కు ఎలా షేర్ చేసుకుంటుందో… దీంతో పాటు మీ వివరాలను వ్యాపారులకు ఎలా షేర్ చేస్తారో అన్నీ ఆ కొత్త రూల్స్‌లో వివరంగా ఉన్నాయి. అసలు వాట్సప్ అంటేనే… ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్న పేరుంది. అందుకే ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరిగింది. అసలు వాట్సప్ లేని స్మార్ట్ ఫోనుండదు. ఒకరకంగా చెప్పాలంటే… వాట్సప్ కోసమే స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్లున్నారు. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటంతో… అంతటి పాపులారిటీ లభించింది. ప్లే స్టోర్‌లో వాట్సప్ లాంటి యాప్స్ బోలెడన్ని ఉన్నా… వాట్సప్ కే క్రేజ్. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటే మీరు పంపిన మెసేజ్ అవతలివారికి మాత్రమే కనిపిస్తుంది. ఎవరూ హ్యాక్ చేసి ఆ మెసేజ్‌ని చదవడం సాధ్యం కాదు. కానీ, ఇప్పుడు వాట్సప్ ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు వచ్చాయి. మీరు వాట్సప్ కొత్త రూల్స్ యాక్సెప్ట్ చేసినట్టైతే… మీరు ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కి తెలుస్తాయి. అంతేకాదు… మీరు వాట్సప్‌లో పంపే చిన్న టెక్స్ట్ మెసేజెస్ పైనా వాట్సప్ నిఘా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, మెసేజెస్ అన్నీ… వాట్సప్ చేతుల్లోకి కూడా వెళ్తాయి. అంటే మీ అభిరుచులు ఏంటీ, మీరు ఎక్కువగా ఏ టాపిక్స్‌పై ఆసక్తి చూపిస్తారు, ఎక్కువగా వేటి గురించి మాట్లాడతారు అన్న విషయాలు వాట్సప్‌కు తెలుస్తాయి. ఇలా మీ అభిరుచులు, ఆసక్తులు వాట్సప్‌కు తెలియడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటనుకుంటున్నారా..? ఈ డేటా మొత్తాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది వాట్సప్.
previous post
next post