telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నందమూరి తారకరామారావు గారు నటించిన 100 వ చిత్రం “గుండమ్మ కథ” నేటికీ 62 సంవత్సరాలు

నందమూరి తారకరామారావు గారు నటించిన 100 వ చిత్రం విజయా వారి “గుండమ్మ కథ” సినిమా 07-06-1962 విడుదలయ్యింది.

నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి లు విజయా ప్రొడక్షన్స్ లిమిటెడ్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ: చక్రపాణి, మాటలు: డి.వి.నరసరాజు, పాటలు: పింగళి నాగేంద్రరావు, సంగీతం: ఘంటసాల . ఛాయా గ్రహణం(ఫోటోగ్రఫీ): మార్కస్ బార్ట్లే, కళ: గోఖలే,కళాధర్, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, కూర్పు: జి.కళ్యాణ సుందరం,డి.జి.జయరాం అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, యస్.వి. రంగారావు, సూర్యకాంతం, రమణారెడ్డి, రాజనాల, ఛాయాదేవి, హరనాధ్, ఎల్.విజయలక్ష్మి, అల్లు రామలింగయ్య, హేమలత, ఋష్యేంద్రమణి, మిక్కిలినేని తదితరులు నటించారు.

మధుర గాయకులు ఘంటసాల గారి సంగీత సారధ్యంలో పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి.

“”లేచింది.. నిద్ర లేచింది.. మహిళా లోకం..
దద్దరిల్లింది పురుష ప్రపంచం”
“కోలు కోలోయన్న కోలో నాసామి,
కొమ్మలిద్దరు మంచి జోడూ”
“వేషమూ మార్చెనూ భాషనూ మార్చెనూ
మోసము నేర్చెను.”

“అలిగిన వేళనె చూడాలి గోకుల కృష్ణుని అందాలూ”
” ప్రేమ యాత్రలకు బృందావనమూ,
నందనవనమూ ఏలనో’ ”
“మౌనముగా నీమనసు పాడిన
వేణు గానమును వింటిలే ”

“ఎంత హాయి ఈరేయి ఎంత మధుర మీహాయి”
వంటి మధురమైన పాటలు నాటికి, నేటికి ప్రేక్షకులకు వీనుల విందులు చేస్తున్నాయి.
ఈ సినిమాకథ కు కన్నడ చిత్రం “మనె తుంబిద హెణ్ణు” మూలం.

ఈ కథను కొద్దిగా మార్పులు చేసి చక్రపాణి గారు “గుండమ్మకథ” సినిమా కథను రూపొందించారు.
ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ కలయిక లో వచ్చిన 10 వ సినిమా ఇది.
“గుండమ్మ కధ” తెలుగు సినిమా ఎన్.టి.రామారావు గారికి 100 వ సినిమా కాగా అక్కినేని నాగేశ్వరరావు గారికి 99 వ సినిమా కావటం విశేషం.

ఎన్టీఆర్ గారి 100 వ సినిమా సూపర్ హిట్ కాగా
ఏ.ఎన్.ఆర్. 100 వ చిత్రం తమిళ గుండమ్మ కధ
“మనిదన్ మారవిల్లే” సినిమా ఫ్లాఫ్ అయింది.

ఈచిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు, మొత్తం 21 కేంద్రాల్లో (లేట్ రన్ తో కలుపుకుని)100 రోజులు,
ఒక కేంద్రంలో 175 రోజులు (సిల్వర్ జూబ్లీ) ఆడింది.
100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు :-
(1) విజయవాడ –దుర్గాకళామందిరం(175 రోజులు)
(2) హైదరాబాద్– ప్రభాత్(105 రోజులు)
(3) గుంటూరు — నాజ్
(4) రాజమండ్రి — అశోక
(5) కాకినాడ — క్రౌన్
(6) విశాఖపట్నం — లక్ష్మీ
(7) నెల్లూరు — రంగమహాల్
(8) విజయనగరం — శ్రీరామా
(9) ఏలూరు — వెంకట్రామా
(10) మచిలీపట్నం — బృందావన్
(11) భీమవరం — సత్యనారాయణ
(12) గుడివాడ — శరత్
(13) ఒంగోలు — సీతారామ
(14) తిరుపతి — జ్యోతి
(15) కర్నూల్ — చాంద్
(16) సికింద్రాబాద్ — అలంకార్
(17) తెనాలి — స్వరాజ్,
(18) వరంగల్ — రామా,
(19) నిజామాబాద్ – మోహన్,
(20) నరసరావు పేట–నాగూర్ వలి,
(21) చిలకలూరిపేట — విశ్వనాథ పిక్చర్ ప్యాలెస్
లలో 100 రోజులు ఆడింది.

హైదరాబాద్ — ప్రభాత్ టాకీస్ లో 105 రోజులు (రోజు 3 ఆటలతో).
హైదరాబాద్ లో 3 ఆటలతో 100 రోజులు ఆడిన మొట్టమొదటి సినిమా( అంతవరకు 2 ఆటలు మాత్రమే వేసేవారు).
విజయవాడ — దుర్గా కళామందిరం లో 175 రోజులు (జూబ్లీ) ఆడింది. అయితే ఈ సినిమా రజతోత్సవ వేడుకలు జరపకుండా నిర్మాతలు ఆ మొత్తాన్ని చైనా తో యుధ్ధం జరుగుతున్న సమయంలో భారత సైన్యం కు భారతదేశ రక్షణనిధి కి విరాళం గా అందచేశారు. ….

Related posts