ఎం.కరుణానిధి(తమిళనాడు ముఖ్యమంత్రి) మృతితో ఖాళీ అయిన తిరువరూర్ స్థానానికి ఈ నెల 28న ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వృద్ధాప్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన కరుణానిధి గతేడాది ఆగస్టులో కన్నుమూశారు.
గత నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న తిరువరూర్ అసెంబ్లీ స్థానానికి సోమవారం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వాతావరణ సమస్యలు, పండుగల నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించలేకపోయామని ఈసీ పేర్కొంది. ఈ నెల 28న ఉప ఎన్నిక నిర్వహించనుండగా, 31న ఓట్లను లెక్కించనున్నారు.